111లో తీవ్రమైన, 254లో మోస్తరు కరువు
ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 18 శాతం తగ్గుదల
వీబీజీ గ్రామ్‌జీలో అదనంగా 50 రోజుల పని కల్పించాలి
రైతులకు నగదు రూపంలో వ్యవసాయ పెట్టుబడి రాయితీ
కేంద్రం రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
జిల్లాల కలెక్టర్లు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 111 మండలాల్లో తీవ్రమైన, 254 మండలాల్లో మోస్తరు కరువు ఉంని ప్రకటించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 18 శాతం తగ్గిందని తెలిపింది. కరువు నేపథ్యంలో సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలనీ, తాగునీరు, పశుగ్రాసం, రైతులకు తక్షణ సాయం అందించాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్‌జాజు మంగళవారం కరువు మండలాలకు సంబంధించి జీవో నెంబర్ 3 (ఉత్తర్వులు) విడుదల చేశారు. కరువు ప్రభావిత రైతులకు పంట నష్ట పరిహారం, పెట్టుబడి రాయితీ, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, పశువుల సంరక్షణ, ఉపాధి కల్పన వంటి చర్యలను వెంటనే చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
నల్లగొండ, సంగారెడ్డిలో అత్యధికం... మెదక్ అత్యల్పం
రాష్ట్రంలో కరువు ప్రభావితం ఉన్న మండలాలు నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 28 మండలాలున్నాయి. అత్యల్పంగా మెదక్ జిల్లాలో ఒకటే మండలంలో కరువు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం గమనార్హం. ఆదిలాబాద్‌లో 20, భద్రాద్రి కొత్తగూడెంలో 16, హన్మకొండలో 14, జగిత్యాలలో మూడు, జనగామలో నాలుగు, జయశంకర్ భూపాలపల్లిలో ఐదు, జోగులాంబ గద్వాలలో 13, కామారెడ్డిలో నాలుగు, కరీంనగర్లో మూడు, ఖమ్మంలో 17, కొమరంభీం ఆసిఫాబాద్‌లో ఐదు, మహబూబాబాద్‌లో ఏడు, మహబూబ్ నగర్లో 13, మంచిర్యాలలో 11, మెదక్‌లో ఒకటి, మేడ్చల్ మల్కాజిగిరిలో తొమ్మిది, ములుగులో నాలుగు, నాగర్‌కర్నూల్‌లో 13, నల్లగొండలో 28, నారాయణపేటలో 13, నిర్మల్‌లో తొమ్మిది, నిజామాబాద్‌లో 18, రాజన్న సిరిసిల్లలో రెండు, రంగారెడ్డిలో 18, సంగారెడ్డిలో 28, సిద్ధిపేటలో ఎనిమిది, సూర్యాపేటలో 23, వికారాబాద్‌లో 20, వనపర్తిలో 11, వరంగల్‌లో ఎనిమిది, యాదాద్రి భువనగిరిలో 17 చొప్పున 31 జిల్లాల్లో 365 మండ లాల్లో కరువు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
17 శాతం తక్కువ వర్షపాతం
జూన్ ఒకటి నుంచి గతనెల 30 వరకు రాష్ట్రంలో నమోదైన వర్షపాతం గణాంకాలు కరువు తీవ్రతను వెల్లడిస్తున్నాయని సీఎస్ తెలిపారు. సాధారణంగా ఈ నాలుగు నెలల కాలంలో 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉందని పేర్కొన్నారు. కేవలం 615.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని వివరించారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 17 శాతం లోటు ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో కరువు ప్రభావానికి ప్రధాన సూచికగా వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గడమేనని పేర్కొన్నారు. ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం గతంలో 139.28 లక్షల ఎకరాలు ఉందని తెలిపారు. ప్రస్తుత సీజన్లో 126.06 లక్షల ఎకరాలకు తగ్గిందని వివరించారు. వరి సాగు విస్తీర్ణం 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు పడిపోయిందని పేర్కొన్నారు. సుమారు 12.19 లక్షల ఎకరాల మేర వరి సాగు తగ్గిందని తెలిపారు.
జలాశయాల్లోనూ తగ్గిన నీటి నిల్వలు
వర్షపాతం లోటుతోపాటు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా జలాశయాల్లో కలిపి ప్రస్తుతం 179.63 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని తెలిపారు. జలాశయాల మొత్తం సామర్థ్యం 585 టీఎంసీలని వివరించారు.
శాస్త్రీయ ప్రమాణాలతో కరువు అంచనా
కరువు మండలాల గుర్తింపును కేవలం వర్షపాతం ఆధారంగా కాకుండా, వివిధ శాస్త్రీయ ప్రమాణాలను సమన్వయం చేసి చేపట్టినట్టు సీఎస్ పేర్కొన్నారు. జూన్ ఒకటి నుంచి గతనెల 30 వరకు ఆటోమేటెడ్ వర్షపాతం నమోదు వ్యవస్థలు, టెలిమెట్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించామని తెలిపారు. పొడి వాతావరణం కొనసాగిన రోజులను కూడా అంచనా ప్రక్రియలో పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని 10 శాతం గ్రామాల్లో నమూనా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికలు, సంబంధిత శాఖల సాంకేతిక విశ్లేషణలను పరిశీలించిన అనంతరం కరువు మండలాల జాబితాను ఖరారు చేశామని వివరించారు.
ఆర్నెల్లపాటు కరువు ప్రభావం
కరువు ప్రకటనకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆర్నెల్లపాటు అమల్లో ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. అంతకుముందే పరిస్థితులు మెరుగుపడితే నోటిఫికేషన్‌ను ముందుగానే ఉపసంహరించవచ్చని తెలిపారు. జాబితాలో లేని ఇతర మండలాల్లోనూ పరిస్థితులను రాష్ట్ర కరువు పర్యవేక్షణ కేంద్రం నిరంతరం గమనిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
రైతులకు పెట్టుబడి రాయితీ.. డీబీటీ ద్వారా చెల్లింపులు
కరువు కారణంగా నష్టపోయిన రైతులకు వ్యవసాయ పెట్టుబడి రాయితీ అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. వ్యవసాయ, సహకార శాఖలు అర్హులైన రైతుల వివరాలను సేకరించి, నిబంధనల ప్రకారం సహాయం అందించాలని కోరారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్ర సహాయం అందిన తేదీ నుంచి ఒక నెలలోపు ప్రభావిత రైతులకు వ్యవసాయ పెట్టుబడి రాయితీని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. లబ్ధిదారుల జాబితాలను సంబంధిత జిల్లా కలెక్టర్ల వెబ్సైట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లోనూ ప్రచురించాలని కోరారు. దీనివల్ల సహాయం ఎవరికి అందింది, ఎంతమందికి అందాల్సి ఉంది అనే వివరాల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
తాగునీరు, పశుగ్రాసం, పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
కరువు పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరాను పెంచాలని జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పశువులకు పచ్చి, ఎండు మేత అందు బాటులో ఉంచడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో పశువుల శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు చెందిన సంబంధిత అధికారులు కూడా అవసరమైన చర్యల్లో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల వివరాలు, ఖర్చుల వివరాలతో ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలని తెలిపారు. సహాయక చర్యల పురోగతిపై నిర్ణీత వ్యవధుల్లో రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
వ్యవసాయ రుణాల వసూళ్లపై కీలక ఆదేశాలు
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)తో సంప్రదించి, మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు అనుమతించిన మేరకు రైతులపై బలవంతపు రుణ వసూళ్లను నిలిపేయాలనీ, లేదా తగిన వెసులుబాటు కల్పించడం పరిశీలించాలని పేర్కొన్నారు. ఇది కరువు ప్రభావిత రైతులకు తక్షణ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో కీలకంగా మారనుందని తెలిపారు.
ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణులకు ఊరట
కరువు వల్ల వ్యవసాయ పనులు తగ్గితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుందని సీఎస్ పేర్కొన్నారు. దీన్నీ దృష్టిలో ఉంచుకుని ఉపాధి కల్పన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిలో భాగంగా ఉపాధి హామీ పథకం (వీబీజీ గ్రామ్‌జీ) కింద అదనంగా 50 రోజుల పని కల్పించాలని కోరారు. ఇందుకు అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
కరువు తీవ్రతను ఎదుర్కొనేందుకు రాష్ట్ర అసెంబ్లీ గతనెల 18న ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై తీర్మానం ఆమోదించిందని సీఎస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర బృందాన్ని పంపించి కరువు పరిస్థితులను అంచనా వేయాలనీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయం మంజూరు చేయాలనీ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్రం వాటాను విడుదల చేయాలని తీర్మానంలో కోరారు. రాష్ట్రానికి అదనంగా రూ.20 వేల కోట్ల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ఆర్థిక లోటు పరిమితిని మూడు శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని తెలిపారు. అదనపు ఎరువుల సరఫరా, 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్, తాగునీరు, పశుగ్రాసం, పంట నష్టానికి సంబంధించిన సహాయం అందించాలని పేర్కొన్నారు.
కరువు వివరాలు
అంశం ఉత్తర్వుల్లోని గణాంకాలు
సాధారణ వర్షపాతం 740.6 మి.మీ.
వాస్తవ వర్షపాతం 615.5 మి.మీ.
వర్షపాతం లోటు 17 శాతం
సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాలు
ప్రస్తుత ఖరీఫ్ సాగు విస్తీర్ణం 126.06 లక్షల ఎకరాలు
సాధారణ వరి సాగు విస్తీర్ణం 69.19 లక్షల ఎకరాలు
ప్రస్తుత వరి సాగు విస్తీర్ణం 57 లక్షల ఎకరాలు
జలాశయాల మొత్తం సామర్థ్యం 585 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వలు 179.63 టీఎంసీలు
తీవ్ర కరువు మండలాలు 111
మోస్తరు కరువు మండలాలు 254
మొత్తం కరువు మండలాలు 365
కరువు ప్రభావిత జిల్లాలు 31






కామెంట్లు (0)