మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సులో వక్తలు
ఏకగ్రీవంగా పలు తీర్మానాలు ఆమోదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫీల్డ్ రిపోర్టర్లపై దాడులు, ఆన్లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాలని జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 135 మందికి పైగా మహిళా జర్నలిస్టులు సదస్సులో పాల్గొన్నారు. తాము ఎదుర్కుంటున్న వ్యవస్థాగత, క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ‘గతంలో అభిప్రాయాలు, వాస్తవాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవాకాశం ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే వాస్తవాలను నియంత్రిస్తోంది’ అని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛ, భౌతిక దాడుల నుంచి భద్రత , ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పెరుగుతున్న దాడులు, ప్రతికూల పరిణామాలను మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు తీవ్రంగా ఖండించింది. పోష్ చట్టం కఠినంగా అమలు చేయాలనీ, సమాన వేతనం, ప్రాధాన్య హోదాలు కల్పించాలనీ, నెలకు ఒకరోజు వేతనంతో కూడిన ప్రత్యేక రుతుక్రమ సెలవు, ఏకీకృత పెన్షన్ విధానం, ఉద్యోగ భద్రత, అక్రిడిటేషన్, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సదస్సు డిమాండ్ చేసింది. మహిళా సదస్సు ఆమోదించిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకుని చట్టపరమైన, రక్షణాత్మక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. సదస్సులో ప్రొఫెసర్ పద్మజా షా, కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ అయేషా ఖానుమ్, సీనియర్ జర్నలిస్టు ఉమా సుధీర్, న్యూస్ మీటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఖనీజా గరారి తదితరులు పలు అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.






కామెంట్లు (0)