21 టీఎంసీలకు తెలంగాణ, 19 టీఎంసీలకు ఏపీ ఇండెంట్
నీళ్ల ఖారారుపై తేలని నిర్ణయం
నీళ్ల పంపకాలపై అనిశ్చితి అర్దంతరంగా ముగిసిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగార్జున సాగర్‌లో నిల్వ ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ర్టాలకు కేటాయింపుల పంచాయితీ తెగలేదు. హైదరాబాద్‌లోని జలసౌధలో భేటీ అయిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అర్దాంతరంగా ముగిసింది. 2027 ఫిబ్రవరి వరకు 21 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరగా,19 టీఎంసీలు కావాలని ఏపీ అడిగింది. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని కూడా తెలంగాణ లేవనెత్తింది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ అధికారులు స్పందిస్తూ గ్రామీణ నీటి సరఫరా శాఖ చేపడుతున్న పనుల గురించి తమకు తెలియదని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు ఏపీలోని పులిచింతల ప్రాజెక్టులో 42 టీఎంసీల నీరు అందుబాటులో ఉందనీ, పట్టిసీమ ద్వారా కూడా కృష్ణా డెల్టాకు నీరు వస్తోందని తెలంగాణ వాదించింది. ఈ నేపథ్యంలో సాగర్ నీటిని తెలంగాణ అవసరాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య నీటి అవసరాలు, వినియోగంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయి బోర్డు సమావేశంలో మరోసారి చర్చించాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
హైదరాబాద్‌కు 15 టీఎంసీలు అవసరం : తెలంగాణ ఈఎన్సీ రమేశ్‌బాబు
నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం మొత్తం 45 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు తెలిపారు. కేఆర్‌ఎంబీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే జులై వరకు ఉన్న నీటిని ఆచితూచి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమే జులై వరకు 15 టీఎంసీల నీరు అవసరమని వివరించారు. సాగర్ నీటిని తాగునీటి అవసరాలు, కుడి, ఎడమ కాల్వలకే వినియోగించాలని సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటితో కృష్ణా డెల్టాకు చుక్క నీరు కూడా ఇచ్చే అవకాశం లేదని బోర్డుకు తెలిపిన్టు పేర్కొన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం పోగా మిగిలే 25 టీఎంసీల నీటి వినియోగంపై చర్చిద్దామని సూచించినట్టు రమేశ్‌బాబు తెలిపారు.
19 టీఎంసీలు కేటాయించాలి : ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి
ఆంధ్రప్రదేశ్ తాగు నీటి అవసరాల కోసం 19 టీఎంసీలు కావాలని బోర్డును కోరినట్టు ఆ రాష్ర్ట ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. నీటీ కేటాయింపులపై ఏపీ10 రోజుల క్రితమే బోర్డుకు లేఖలు రాశామన్నారు. కాగా సమావేశంలో పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని లేవనెత్తగా, ఏపీ జలవనరుల శాఖ అధికారులు స్పందిస్తూ గ్రామీణ నీటి సరఫరా శాఖ చేపడుతున్న పనుల గురించి తమకు తెలియదని పేర్కొచాయిన్నారని తెలంగాణ ఈఎన్సీ చెబుతుండగా అలాంటి చర్చ జరగలేదని నరసింహమూర్తి తెలిపారు.





కామెంట్‌లు (0)