Magazines

ఏపీ నీళ్ల దోపిడీకి కాంగ్రెస్‌ సర్కార్‌ వత్తాసు

31 నిమిషాల క్రితం

Congress government abets AP’s water plunder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పనులు వెంటనే ఆపాలి

కృష్ణా బోర్డుకు బీఆర్ఎస్ ఫిర్యాదు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ ‌నీళ్ల దోపిడీకి కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌వత్తాసు పలుకుతోందని బీఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకుల బృందం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మెన్‌‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం బీఆర్‌ఎస్‌ ‌నేతలు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమపై నమోదైన అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏపీకి దాసోహం అంటున్నారని విమర్శించారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి సొరంగాల ద్వారా నీటిని అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనివల్ల సాగర్ ఆయకట్టు రైతులతో పాటు హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ‘నగరంలో రూ.800 ఉన్న వాటర్ ట్యాంకర్ రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి కష్టాలతో హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. సాగునీటి ఇబ్బందులతో రాష్ర్టంలో 25 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఇప్పటికే సింగూరు , మంజీరా పూర్తిగా ఎండిపోయాయి’ అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో ఇప్పటికే ఏపీ తన వాటా కంటే ఎక్కువగా నీటిని వాడుకుందని స్పష్టం చేశారు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలనీ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణకు అందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్‌ చేశారు.

అనుమతుల్లేకుండా ఏపీ నిర్మాణాలు

నాగార్జునసాగర్‌ నుంచి పల్నాడు ప్రాంతానికి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులకు సరైన అనుమతులు, నీటి కేటాయింపులు లేవని బీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014 నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్‌ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేఆర్‌ఎంబీపై ఉందని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌, నీటి కేటాయింపులు, అనుమతులు, ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించాలని కోరారు. అనుమతులు లేకుండా చేపడుతున్న పనుల వల్ల భవిష్యత్‌‌లో తెలంగాణకు కృష్ణా జలాల వినియోగంలో నష్టం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణా జలాల వినియోగం, నీటి కేటాయింపులు, ప్రాజెక్ట్‌ నిర్మాణాలపై పారదర్శకత ఉండాలని కోరారు. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే డి.సుధీర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ఏపీ జలదోపిడిపై డిసెంబర్‌ 10‌న నల్లగొండలో సభ

మాజీ మంత్రి జగదీశ్‌‌రెడ్డి

కృష్ణా జలాలను ఏపీ కి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 10 న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి జగదీశ్‌‌రెడ్డి తెలిపారు. నల్లగొండ నగారా పేరిట నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్