Magazines

తప్పు మీరు చేసి మాపై నిందలా?

20 నిమిషాల క్రితం

ఏపీ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటాం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

ఏపీకి 512 , తెలంగాణకు 299 టీఎంసీలు చాలని లేఖ రాసింది మీరు కాదా?

కేసీఆర్‌‌, హరీశ్‌రావు సమాధానం చెప్పాలి :సీఎం రేవంత్‌‌రెడ్డి

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌ను ఆపాలని కేఆర్‌ఎంబీ, కేంద్రానికి ఫిర్యాదు చేశాం

నీటి హక్కులను జలసమాధి చేసిన బీఆర్‌ఎస్‌ను రాజకీయ సమాధి చేయాలి

కృష్ణా జలాల్లో హక్కుల్లేకుండా మరణశాసనం రాశారు

6-8 నెలల్లో బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చేలా ప్రయత్నిస్తున్నాం

ఏపీ ప్రాజెక్టులను అడ్డుకుంటాం చుక్క నీరు వదులుకోం : మంత్రి ఉత్తమ్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటి హక్కు లేకుండా చేసిన పాపం బీఆర్‌ఎస్‌‌దేనని ముఖ్య మంత్రి రేవంత్‌‌రెడ్డి విమర్శించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌‌రావు సంత కాలు చేసి మరణశాసనం రాశారని అన్నారు. ఎవరి ఒత్తిడి మేరకు హరీశ్‌‌రావు ఆ సంతకం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ఏపీకి మేలు చేసి, తెలంగాణను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌లోని బోధి పెవిలియన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదీ జలాలను ఏపీకి శాశ్వతంగా తాకట్టు పెట్టిందే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమని విమర్శిం చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై అబద్ధాలు, అసత్యాలను బీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తున్నదని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను జలసమాధి చేసిన బీఆర్‌ఎస్‌‌ను రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయాలని పిలుపునిచ్చారు.

మా చిత్తశుద్ధిని ప్రశ్నించొద్దు

రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిం‌చాల్సిన అవసరం లేదనీ, బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ మధ్య గుంటూరుకు తాగునీటి కోసం ఒప్పందం కుదిరిందనీ, రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌కింద ప్రాజెక్టును ఏర్పాటు చేస్తూ2022, ఫిబ్రవరి 16న ఉత్తర్వులు వచ్చాయని గుర్తు చేశారు. ఆ జీవో ఆధారంగానే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ‌పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ అంశం తమ దృష్టికి రాగానే పల్నాడు వాటర్‌ ‌గ్రిడ్‌పై కేఆర్‌ఎంబీ, కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని వివరించారు. అయినా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బురదజల్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

ఏపీ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటాం

ఏపీ ప్రాజెక్టులను తాము చట్టబద్ధంగానే అడ్డుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చెప్పారు. ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులపై ప్రధానిని రెండు సార్లు, జల శక్తి మంత్రిని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో వాటా కోసం కేఆర్‌ఎంబీ, సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తున్నామని వివరించారు. బ్రిజేశ్‌‌కుమార్‌ ‌బ్రిబ్యునల్‌‌ను 2004లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆరు, ఎనిమిది నెలల్లో తీర్పు వచ్చేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మీడియా సంస్థలు అబద్ధాలు, అసత్యాలు కాకుండా వాస్తవాలను పరిశీలించి వార్తలను ప్రజలకు అందించాలని కోరారు.

చుక్క నీరు వదులుకోం : ఉత్తమ్‌

కృష్ణా నదీ జలాల్లో చుక్క నీటిని వదులుకోబోమని మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి స్పష్టం చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారంటూ పల్నాడు వాటర్‌ ‌గ్రిడ్‌‌పై కేఆర్‌ఎంబీ చైర్మెన్‌, కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్‌ 512 టీఎంసీలకు అంగీకరించినందుకే కడుతున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

హరీశ్‌‌రావు గురువు వైఎస్‌

వైఎస్‌ ‌మంత్రివర్గంలో నాటి టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు మంత్రులుగా కొనసాగారని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అన్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులను పెంచాలని నాటి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దానికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 13‌న జీవో వచ్చిందన్నారు. బడ్జెట్‌ ‌పుస్తకాల్లోనూ పేర్కొన్నారని గుర్తు చేశారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. హరీశ్‌‌రావుకు అసలు గురువు వైఎస్‌ ‌రాజశేఖర్‌‌రెడ్డి అని చెప్పారు. గురుదక్షిణ కింద పోతిరెడ్డిపాడుకు అనుమతిలిచ్చారని అన్నారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు.

చంద్రబాబుకు లొంగిపోయింది నిజం కాదా?

కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలుంటే, రాయలసీమకు 145 టీఎంసీలు, ఆంధ్రకు 
367 టీఎంసీలు కలిపి ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించి 2020, జనవరి 29న సంతకాలు ఎందుకు చేశారని కేసీఆర్‌, హరీశ్‌‌రావును సీఎం రేవంత్‌‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు లొంగిపోయింది నిజం కాదా?అని అడిగారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టి శాశ్వతంగా మరణ శాసనం రాశారని విమర్శించారు. అందుకే పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, ఆర్డీఎస్‌, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. తెలంగాణకు శాశ్వతంగా జలదోపిడీ అయ్యేలా చేశారని విమర్శించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని తెలంగాణకు చెందిన ఎస్‌ఎల్‌‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌‌సాగర్‌, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి కాలేదని అన్నారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే అవి పూర్తయ్యేవని చెప్పారు. కృష్ణా నదిలో నిర్మించే ప్రాజెక్టుల కోసం బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పదేండ్లలో రూ.11,255 కోట్లు ఖర్చు చేస్తే, తాము మూడేండ్లలో రూ.6,767 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. బీఆర్‌ఎస్‌ ఏడాదికి రూ.1,126 కోట్లు ఖర్చు చేసిందనీ, తాము రూ.2,256 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. భూసేకరణ కోసం బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పదేండ్లలో రూ.3,315 కోట్లు ఖర్చు చేసిందనీ, తాము మూడేండ్లలో రూ.3,518 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. భూసేకరణ లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. భూసేకరణపై బీఆర్‌ఎస్‌‌కు చిత్తశుద్ధి లేదని తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్