Magazines

పార్లమెంట్ మార్చ్‌కు కార్మికులు సన్నద్ధం

26 నిమిషాల క్రితం

Workers gear up for Parliament march
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ..నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

కనీస వేతనం రూ.42వేలుగా నిర్ణయించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌లో కార్మికుల ప్రదర్శన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన సభ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వచ్చే నెల 1 నుంచి 3వరకు నిర్వహించనున్న పార్లమెంట్‌ ‌మార్చ్‌‌కు రాష్ట్రం నుంచి ఆయా రంగాల కార్మికులు భారీగా తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నా రు. ఈ నేపథ్యంలో నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనీ, కనీస వేతనం రూ.42వేలుగా నిర్ణయించాలనీ, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ తదితర సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలనీ, విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుల స్థూపం నుంచి లోయర్‌ ‌ట్యాంక్‌‌బండ్‌‌లోని అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు కార్మికులు ప్రదర్శన చేపట్టారు. అనంతరం నగర సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె కుమార స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ‌సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యం, ప్రజలు, కార్మికుల హక్కుల్ని కాపాడుదాం’ అనే నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమానికి సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. లక్ష మంది కార్మికులతో ఢిల్లీకి తరలివెళ్లి పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కార్మికులు ఢిల్లీకి బయలుదేరుతు న్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పోరాటాలు అంతిమంగా విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్దమైన కార్మిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి దారుల ప్రయోజనాలను మరింత సులభతరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ నిర్ణయంతో దేశంలో, రాష్ట్రంలో కోట్లాది మంది కార్మికుల నోట్లో మట్టికొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి నిజమైన సంపద సృష్టి కర్తలు కార్మికులేనంటూ పొగుడుతూనే.. వారి పట్ల అన్యాయమైన నిర్ణయాలు చేయటం తగునా? అని ప్రశ్నించారు. పెట్టుబడి దారులకు రాయితీలిస్తూ.. కార్మికులకు మాత్రం చాలీచాలని వేతనాలు, రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యా, వైద్యంలో పెరుగుతున్న ఫీజులు.. తదితర వాటితో కార్మికుడు సంపద ఎలా సృష్టిస్తాడో చెప్పాలని నిలదీశారు. అందుకే కార్మికులంతా ఏకమై కనీస వేతనం రూ.42వేలు ఇవ్వాల్సిందేనని నిగ్గదీస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నేషనల్ మినిమం ఫ్లోర్ వేజ్ కింద రూ.178 మాత్రమే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇది కార్మికులను మోసం చేయడమేనని విమర్శించారు. దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనేక స్కీమ్‌లు అమలవుతున్నాయని గుర్తు చేశారు. వాటిలో పనిచేస్తున్న వర్కర్లను కార్మికులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది, దేశవ్యాప్తంగా కోట్లాది మంది స్కీమ్ వర్కర్లు పని చేస్తున్నారని తెలిపారు. వారికి పని గంటలు నిర్ణయించడం లేదని, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని, కార్మికులుగా గుర్తించడమే లేదని అన్నారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, పెన్షన్ తదితర హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న 100 రోజుల ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో కొత్త పథకాన్ని తీసుకొచ్చి నిధులు తగ్గిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాని నిర్ణయాలను తుది రూపం ఇవ్వడం లేదని, వేతన సవరణ, డీఏల అమలు ఆలస్యం అవుతోందని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, రవాణా రంగ కార్మికులను విస్మరిస్తున్నారని, వారికి సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కార్మికులపై దాడులు

రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై దాడులు చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, ఈశ్వర్‌‌రావు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ పాలనకు 
12ఏండ్లు గడిచినా కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణను తక్షణమే నిలిపివేయాలనీ, విద్యుత్ చట్టం 2003, విద్యుత్ సవరణ బిల్లు 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లి కార్జున్, రాష్ట్ర కార్యదర్శులు పి సుధాకర్, పి శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా అ‌ధ్యక్ష కార్యదర్శులు రుద్రకుమార్, జగదీశ్‌, హైదరాబాద్ సౌత్ జిల్లా అద్యకార్యదర్శులు మీనా, శ్రావణ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్, 
రామ్మోహన్ రావు, అజయ్ బాబు, హైదరాబాద్ నగర నాయకులు నరేష్, మల్లేష్, మహేందర్, సంతోష్, కృష్ణ, జంగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్