ఎంఎస్పీ దగ్గర కొనసాగుతున్న మోసం
కొనుగోళ్లలో వ్యాపారుల ఇష్టారాజ్యం
సీసీఐ రంగంలోకి రాకుండా వ్యూహం
ఆదిలాబాద్ పత్తికి డిమాండ్‌ను తగ్గించేందుకు యత్నం
నవతెలంగాణ -ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తక్కువగా ఉన్నా.. కొద్దిపాటి పంటకైనా రైతుకు ఆశించిన లాభం చేకూరడం లేదు. మొదట్లో ఆశాజనకంగా ఉన్న పత్తి ధర.. ఆ తర్వాత వ్యాపారుల మాయాజాలంలో చిక్కుకుంది. ప్రయివేటు వ్యాపారుల ఎత్తుగడలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పోటీ పడి పంటలను కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను క్రమంగా తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు చేరువలోనే కొనసాగుతోంది. వ్యాపారుల నిర్ణయాలే ధరలను శాసిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి పంట ధరలో దగా జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మంచి ఆదరణ ఉండేది.
ప్రతి రోజూ వందల సంఖ్యలో పంట వాహనాలు వచ్చేవి. ప్రస్తుతం ఆశించిన ధర లభించకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొదట్లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ పలికిన ప్రయివేటు ధర నెమ్మదిగా తగ్గుతోంది. ప్రారంభంలో కొంతమేర మంచి ధర ఇచ్చిన వ్యాపారాలు తద్వారా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థను రంగంలోకి రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తునట్టు తెలుస్తోంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌కు తెచ్చిన పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్ మార్కెట్‌కు పక్కరాష్ట్రం నుంచి పత్తి దిగుబడులు వచ్చేవి. ఈసారి ఇక్కడే ధర లభించక మహారాష్ట్రకు వెళ్లి పత్తి విక్రయిస్తున్నారు. జిల్లా సరిహద్దు గ్రామాల రైతులు మహారాష్ట్రకు పత్తి దిగుబడులను తీసుకెళ్తున్నారు.
ఎమ్మెస్పీ ధర సమీపంలోనే ప్రయివేటు కొనుగోళ్లు
ఈ ఏడాది కనీస పత్తి మద్దతు ధర రూ.8667 కాగా.. కొనుగోళ్ల ప్రారంభం రోజు రూ. 9260 పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గింది. తేమ శాతం పేరుతో కోతలు విధించి రైతులను మోసం చేస్తున్నారు. అసలే దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటే వ్యాపారుల మోసాలకు రైతులు దగా పడుతున్నారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా సాగాల్సి ఉండగా, ధరల నిర్ణయంలో వ్యాపారుల ప్రభావం పెరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. మద్దతు ధర అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు ధరల తగ్గింపుపై కూడా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. వ్యాపారుల కొనుగోళ్ల తీరును పరిశీలించి, మార్కెట్ యార్డులో రైతులకు న్యాయమైన ధర కల్పించడంతోపాటు మద్దతు ధర అమలయ్యేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రూ. 8870 ధర వచ్చింది : తాంసి రైతు బి.ముకుంద్‌రావు
ఆరు ఎకరాల్లో నీళ్లు ఇచ్చి పత్తి పండిస్తే మొదటిసారి మార్కెట్‌కు 9 క్వింటాళ్లు తెచ్చాను. 8 శాతం తేమ ఉండటంతో రూ. 8870 ధర వచ్చింది. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎంత దిగుబడి వస్తుందో తెలియని పరిస్థితి. పెట్టుబడి వస్తే చాలు అనేలా ఉంది. అప్పులైతే తీరలేదు కానీ నష్టం మాత్రం జరిగింది.
మహారాష్ట్రకు వెళ్తున్నారు : కస్తూరి రాజేశ్వర్, కాటన్ కమీషన్ ఏజెంట్
గతంలో ఆదిలాబాద్ మార్కెట్‌కు పెద్దఎత్తున దిగుబడులు వచ్చేవి. ప్రతిరోజూ వందల సంఖ్యలో పత్తి బండ్లు వచ్చేవి. కరువు పరిస్థితుల్లో రైతులు ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడ విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల రైతులు మహారాష్ట్రలో మంచి ధర లభించడంతో అక్కడికి వెళ్తున్నారు.





కామెంట్‌లు (0)