Magazines

సిద్దిపేటకు మేమే స్వాతంత్ర్యం తెస్తాం

15 నిమిషాల క్రితం

Siddipet
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రజా జీవితం నుంచి హరీశ్‌రావును తరిమేసే వరకు పోరాటం

ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలు అమ్ముకున్నాడు

కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీటిపై బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వాలి

19న జరిగే సభలో సీఎం అన్ని విషయాలు బయటపెట్టాలి :
కల్వకుంట్ల కవిత


నవతెలంగాణ-సిద్ధిపేట
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి చాలా సంవత్సరాలు అయినా సిద్దిపేటలో ఉన్నవారికి స్వాతంత్ర్యం రాలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ స్వాతంత్ర్యం తెస్తుందని తెలిపారు. హరీశ్‌ రావు బొగ్గు దొంగ అని, ఇంత అవినీతి చేసిన వ్యక్తిని కచ్చితంగా ప్రజా జీవితం నుంచి తరిమికొట్టే వరకు వదలం అని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో తెలంగాణ రక్షణ సేన ఆఫీస్ నిర్మాణం కోసం భూమి పూజ ఆమె చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘సిద్దిపేట జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా, నా సొంత గడ్డ, పుట్టింటి వాళ్లు కాదన్న సరే.. పుట్టిన ఊరు మాత్రం నన్ను గతేడాది బతుకమ్మ పండుగకు ఆహ్వానించింది. వాళ్లందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఇక్కడ నుంచి పోరాటం మొదలుపెడితే ఆశీర్వదించారని, సామాజిక న్యాయ తెలంగాణ కోసం తాను చేస్తున్న పోరాటానికి కూడా సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు.

సిద్దిపేట కు ఇటు అటు చూస్తే కేసీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు లాంటి హేమాహేమీలు ఉన్నారని, కానీ నిజాం కట్టిన ఘన్ పూర్, సింగూర్ తప్ప మనకు ప్రాజెక్ట్ లు ఏమీ లేవన్నారు. కాళేశ్వరం ద్వారా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేదుంటే అందులో ఉమ్మడి మెదక్ జిల్లాకే 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలన్నారు. దాదాపు 93 వేల కోట్లు ఖర్చు చేసి ఇచ్చింది మాత్రం లక్ష ఎకరాలు మాత్రమే అని, ఒక్క సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక లో కలిసి లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. సిద్దిపేటలో 120 రైస్ మిల్లులు ఉంటే ఇప్పుడు 20 కూడా లేవనీ, సిద్దిపేటలో పెద్ద కోమటోళ్ల వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బ తీసేలా కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చాడనీ, పద్మశాలీ, అవుసులోళ్ల బంగారం పనిని కూడా ఇబ్బంది పెట్టాడని అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వలేదనీ, కానీ రంగనాయక సాగర్ వద్ద 14 ఎకరాలకు... ఎకరాకు 6 లక్షల చొప్పున హరీష్ రావు పరిహారం తీసుకొని మంచి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని ఆరోపించారు.

సిద్దిపేటలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, మున్సిపల్ ఎన్నికల నుంచి పోరాటం మొదలుపెడతామని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదనీ, గండిపల్లి రిజర్వాయర్ కడతామని చెప్పి భూములు తీసుకున్నారనీ, ఇప్పటి వరకు కట్టటం లేదన్నారు. మల్లన్న సాగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో 1983 లో భూకంపం వచ్చిందనీ, అక్కడ రిజర్వాయర్ కడితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ ఎన్ జీఆర్ఐ వాళ్లు 2018 లోనే రిపోర్ట్ ఇచ్చారనీ, హరీశ్‌ రావు మాత్రం ఆ చర్యలేమీ తీసుకోకుండా 6 వేల కోట్ల అంచనా వ్యయాన్ని 9 వేల కోట్లకు పెంచి ఆగమాగం పనులు చేశారని ఆరోపించారు. ఇప్పుడు బండ్ వద్ద లీకులు మొదలయ్యాయని, లీకు బయటపడుతోందని, దాన్ని కవర్ చేసేందుకు హరీష్ రావు బ్లాస్టింగ్ పేరుతో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి సిస్మిక్ రిపోర్ట్, ఎన్ జీఆర్ఐ నివేదికలు ఉన్నాయనీ అన్నారు. గుంటనక్కతో గుంపు మేస్త్రీకి లాలూచీ లేకపోతే ఈ నెల 19 న సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి ఈ అంశంపై చర్యలు తీసుకుంటానని చెప్పాలన్నారు.

నిమ్స్ లో హరీశ్‌రావు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వంద కోట్ల స్కామ్ చేశారనీ, గవర్నరింగ్ కౌన్సిల్ మీటింగ్ లేకుండానే రూ. 25 కోట్ల ఈపీఎఫ్ ఫండ్ ను వేరే ఖాతాలకు మళ్లించారని అన్నారు. ముఖ్యమంత్రికి ఈ స్కామ్ మీద విచారణ చేపట్టే దమ్ముందా? లేదంటే ఆమ్యామ్యాలు తీసుకొని మళ్లీ వదిలేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ భూములు ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారని, తనకు, తన కుటుంబానికి అక్కడ భూమి లేదన్నారు. 2016-2017 కొండపోచమ్మ సాగర్ పొంగి ఒక గ్రామంలోకి నీళ్లు వచ్చాయి, ఆ కాలువ క్వాలిటీ పై కూడా చర్యలు తీసుకోలేదనీ అన్నారు. బొగ్గు డంపింగ్ యార్డ్ పేర్లతో పర్మిషన్లు తీసుకొని మహారాష్ట్ర నుంచి బొగ్గు తెస్తున్నట్లు చెప్పారనీ, హరీశ్‌‌రావు సింగరేణి నుంచి బొగ్గు తెప్పించుకుంటూ అక్కడ కూడా అవినీతి చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది అమరులయ్యారని, వాళ్లకు అగ్గిపెట్టె దొరికింది కానీ గ్యాస్ నూనె పోసుకున్న హరీష్ రావు కు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదని అన్నారు. సమావేశంలో కవిత పలు పేపర్లు చూపిస్తూ మాట్లాడారు. మన పార్టీ జెండా పీకేటోళ్లు, కాల్చేటోళ్ల రాజకీయ జీవితాన్ని ప్రజలే చింపేస్తారని అన్నారు.తాము అధికారంలోకి వస్తే వెంటనే ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని అన్నారు. విలేకరుల సమావేశం అనంతరం అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్