Magazines

కూకట్‌పల్లి ట్రక్‌ పార్క్‌ భూములను అమ్మొద్దు

18 నిమిషాల క్రితం

హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లి,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

భూములు అమ్మడంపైనే 
సీఎం రేవంత్‌‌రెడ్డి ఫోకస్‌

వేలం నిలిపివేయకపోతే సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసి ప్రజా ఉద్యమం : సిద్దిపేట 
ఎమ్మెల్యే హరీశ్‌రావు

భూముల వద్ద ధర్నా

నవతెలంగాణ-కూకట్‌పల్లి

​హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లి, మూసాపేట ట్రక్‌ పార్క్‌కు కేటాయించిన భూములను విక్రయించొద్దని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను అమ్మే హక్కు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. భూముల వేలం ప్రక్రియను నిలిపివేయకపోతే సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసి పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ట్రక్‌ పార్క్‌ భూముల వేలం ప్రతిపాదనను నిరసిస్తూ శుక్రవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌‌రావు మాట్లాడుతూ.. ట్రక్‌ పార్క్‌ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలని, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు కేటాయించొద్దని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. మిగిలిన భూములను కూడా తనఖా పెట్టి నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు సీఎం రేవంత్‌రెడ్డి భూముల విక్రయాల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో హౌసింగ్‌ బోర్డు స్థలాలు, 200 గజాల స్థలాలు, పార్కులు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బొందలగడ్డ వంటి ప్రాంతాలను కూడా విక్రయించే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన భూములను విక్రయించడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

​వేలాన్ని అడ్డుకుంటాం

కూకట్‌పల్లి ప్రజలు, రైతులు ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చిన భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకుంటామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం హెచ్చరించారు. గత ప్రభుత్వాలు ఈ భూములు అమ్మాలని చూసినప్పుడు జెండా పాతి అడ్డుకున్నామని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే యూనివర్సిటీ భూములు, మియాపూర్‌ భూములను అమ్మేందుకు ప్రయత్నించారని, ప్రస్తుతం హాల్ట్‌ పేరుతోనూ భూముల విక్రయానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ భూములను విద్యాసంస్థలు, ఆర్టీఓ కార్యాలయాలు, క్రీడా మైదానాలు వంటి ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు, బీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ రెడ్డి సతీష్‌ అరోరా, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, ముద్దం నరసింహ యాదవ్‌, ఆవుల రవీందర్‌రెడ్డి, తూము శ్రావణ్‌కుమార్‌, పగడాల బాబురావు, మందాడి శ్రీనివాసరావు, సతీష్‌గౌడ్‌, సబిహా గౌసుద్దీన్‌, మహేశ్వరీ శ్రీహరి, సీపీఐ(ఎం) నాయకులు ఐలాపురం రాజశేఖర్‌, సత్యం, సీపీఐ నాయకులు జి.కృష్ణ, బీఆర్‌ఎస్‌, స్థానికులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్