కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
జడ్చర్లలో ఎండిన పంటల పరిశీలన
నవతెలంగాణ-జడ్చర్ల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాన్ వెస్లీ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల గ్రామంలో ఎండిన రైతు పంటలను శనివారం సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలు చేపట్టి రైతుల ఆత్మహత్యలు పెరగకముందే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి పంటకు ఎకరానికి 30 వేలు, వాణిజ్య పంటలు పత్తి, కందులు, వేరుశనగ పంటలకు ఎకరానికి 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లలో నీరు రాక వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్, నవాబ్ పేట, మహమ్మదాబాద్, భూత్పూర్ మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు, నాగసాల గ్రామంలో ఎల్లయ్య, కేశవులు, శ్రీనివాసులు రైతులు వేసిన వరి పంటలు మూడు ఎకరాలకు మూడు ఎకరాలు పూర్తిగా ఎండిపోయిందని, పెద్ద హుస్సేన్ అనే రైతు రెండెకరాల్లో కంది పంట వేస్తే పూర్తిగా ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకురాలు పి జయలక్ష్మి , సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కిల్లె గోపాల్, కురుమూర్తి, జిల్లా నాయకులు దీప్లానాయక్, జగన్, యాదయ్య, సత్తయ్య, సాయిలు, నాగరాజు, సంధ్య తదితర రైతులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)