తుమ్మిడిహెట్టి నిర్మాణంపై మహారాష్ట్రను ఒప్పించండి
ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు రావాలంటూ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామనీ, భూ నిర్వాసితులకు వెంటవెంటనే పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మోడీతో సమావేశమయ్యారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలో ముంపునకు గురైన భూములు, ఇతర ఆస్తులకు పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ సాగు నీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. ఈ ప్రాజెక్టుతో రాష్ర్టంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగు నీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ప్రధానికి వివరించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగు నీటి ప్రయోజనాలు అందడం లేదని సీఎం తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సాస్కీ కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగు నీరు సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) సమర్పించామన్నారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్ లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాలు, పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) త్వరగా జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద సమ్మక్క సాగర్, సీతారామ ఎత్తిపోతల పథకాలకు రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో డిసెంబరు నెలలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా సీఎం ఆహ్వానించారు.
‘ఖేలో ఇండియా’ లోగో, ఆవిష్కరణ
డిసెంబరు 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరిలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ. జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.శేషాద్రి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)