మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టి డీలిమిటేషన్ బిల్లు తెచ్చేందుకు కేంద్రం యత్నం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్తో ముడిపెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాలను డీలిమిటేషన్ ద్వారా గరిష్టంగా 850కి పెంచాలని ప్రతిపాదిస్తోంది. అయితే ఈ బిల్లుకు లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో సభలో సభ్యుల సంఖ్య 540గా ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి 320 మంది సభ్యుల బలం మాత్రమే ఉండటంతో ప్రతిపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. మరోవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా యి. ఈ అంశంపై పార్లమెంట్లో ఆందోళనలు చేపట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశముంది. ఇదిలా ఉండగా, గత వర్షాకాల సమావేశాలను ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ కేంద్రం అధికారికంగా ముగించలేదు. దీంతో 94 రోజులుగా ఆ సమావేశాలు కొనసాగుతున్నట్టుగా ఉన్నాయి.






కామెంట్లు (0)