చైనాలో ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన నిర్మాణం
రెండు నిమిషాల్లోనే లోయను దాటేయొచ్చు
సాహస ప్రియుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
బీజింగ్ : చైనాలోని గుయిజౌ రాష్ట్రంలో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యాన్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా నిలిచింది. బీపాన్ నదిపై ఉన్న లోతైన లోయ మీదుగా నిర్మించిన ఈ వంతెన ఓ ఇంజినీరింగ్ అద్భుతం. ఇది గతేడాది సెప్టెంబర్ 28న అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన నిర్మాణం కేవలం మూడు సంవత్సరాలలోనే పూర్త యింది. నది ఉపరితలం నుంచి వంతెన డాక్ (రహదారి) వరకూ దీని ఎత్తు 625 మీటర్లు.. అంటే సుమారు 2,051 అడుగులు. 2016 నుంచి రికార్డు పుటల్లో ఉన్న డుగే వంతెనను ఈ బ్రిడ్జి అధిగమించి చరిత్ర సృష్టించింది. వంతె న పొడవు 2,890 మీటర్లు. రెండు ప్రధాన స్తంభాల మధ్య ఉండే వేలాడే భాగం పొడవు 1,420 మీటర్లు. ఈ వంతెన కేవలం రవాణా మార్గంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా విలసిల్లుతోంది. వంతెన నిర్మాణం జరిగిన తర్వాత సంవత్సర కాలంలో 30 లక్షల మంది పర్యాటకులు ఈ వంతెనను సందర్శించారు. 'భూమి పగులు'గా పిలిచే ఈ లోయను దాటడానికి గతంలో రెండు గంటల సమయం పట్టేది. ఇప్పుడది కేవలం రెండు నిమిషాలకు తగ్గిపోయింది. సాహస ప్రియుల కోసం ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బంగీ జంపింగ్ వేదిక, జెయింట్ స్వింగ్, పార్కుర్ కోర్సులను ఏర్పాటు చేశారు. పర్యాటకులు లోయ అందాలను వీక్షించడానికి వంతెన కింది భాగంలో 800 మీటర్ల పొడవైన గాజు నడకదారిని, టవర్ పైకి వెళ్లడానికి గ్లాస్ ఎలివేటర్‌ను నిర్మించారు. దక్షిణ టవర్‌పై స్టార్ గేజింగ్ బార్ అండ్ కేఫ్ (స్కై కేఫ్), 300 మీటర్ల ఎత్తయిన కృత్రిమ జలపాతం, బ్రిడ్జి సైన్స్ మ్యూజియం వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. లోయలో వీచే బలమైన గాలులను తట్టుకోవడానికి గాలి అతి సులభంగా దాటి వెళ్లేలా ఓపెన్-గ్రిడ్ స్టీల్ ట్రస్‌లను వాడారు. నిర్మాణ సమయంలో ఉపగ్రహ ఆధారిత కేబుల్ క్రేన్లు, డ్రోన్ల సాయం తీసుకున్నారు. వంతెన కింద ఉన్న గ్రామంలో పర్యాటకుల కోసం అతిథి గృహాలు, దుకాణాలు, కేఫ్‌లు వెలుస్తున్నాయి. మెరుగైన మొబైల్ ఫోన్ కవరేజీ కోసం కొత్త సెల్యులార్ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.







కామెంట్‌లు (0)