మిత్రదేశాల 'ఇంధన'
అవసరాలకు మళ్లింపు
కాంగ్రెస్ నిర్ణయాలను
బేఖాతరు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం
పేద దేశాలపై పెరుగుతున్న ఆర్థిక భారం
వాషింగ్టన్ : ఈ సంవత్సరం ప్రపంచ దేశాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలు కోసం కాంగ్రెస్ కేటాయించిన సుమారు 605 మిలియన్ డాలర్ల నిధులను దారి మళ్లించాలని లేదా నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా కార్పొరేషన్లకు ప్రయోజనం కలిగించే గ్లోబల్ హెల్త్ ఇన్నొవేషన్ ఫండ్‌లోని సుమారు బిలియన్ డాలర్లను తరలించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తక్కువ లేదా ఓ మోస్తరు ఆదాయాన్ని కలిగిన దేశాలకు కేటాయించిన ప్రపంచ ఆరోగ్య నిధులలో కోత పెడుతోంది. నిధులను ఏ విధంగా ఖర్చు చేయాలో నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కే ఉన్నప్పటికీ ట్రంప్ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని స్వచ్ఛంద సంస్థలు, చట్టసభల సభ్యులు మండిపడుతున్నారు.
ట్రంప్ హయాంలో...
ప్రపంచ దేశాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు, పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య సేవలకు కేటాయించిన నిధుల్లో కొంత భాగాన్ని అమెరికా మిత్రదేశాల 'ఇంధన భద్రతా అవసరాల'కు మళ్లించాలని సెప్టెంబరులో విదేశాంగ మంత్రి మార్కో రుబియో సంతకంతో విడుదల చేసిన ప్రత్యేక మెమో సూచించింది. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా మార్కెట్ అంతరాయాలను ఎదుర్కొంటున్న భాగస్వామ్య దేశాలను ఆదుకునేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలు కోసం అమెరికా అనేక దశాబ్దాలుగా నిధులు అందజేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు ఈ కార్యక్రమానికి అమెరికా కేటాయించిన నిధులతో 34,000 మాతృ మరణాలను నివారించగలిగారు. అయితే ఆ తర్వాత కాలంలో చాలా దేశాలకు ఆరోగ్య సాయంలో భారీగా కోతలు పెట్టారు.
నిధుల కోత ఇలా...
ప్రపంచ ఆరోగ్య నిధుల్లో 888 మిలియన్ డాలర్లను సైన్స్, టెక్నాలజీ, వైద్య రంగాల్లో పనిచేస్తున్న అమెరికా కంపెనీలకు మద్దతు ఇస్తున్న ఓ 'ఆవిష్కరణల నిధి'లోకి తరలించే యోచన కూడా ఉన్నదని 2026 బడ్జెట్ పత్రం తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలకు కేటాయించిన ఆరోగ్య నిధుల్లో 1.6 బిలియన్ డాలర్లకు పైగా కోత విధించారు. నిధుల్లో కోతలు, దారి మళ్లింపుల కారణంగా నిరుపేద, ఓ మోస్తరు ఆదాయాన్ని కలిగిన దేశాలు తమ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోలేకపోతున్నాయి.
రష్యా, చైనా, ఇరాన్‌పై నిందలు
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య నిధులపై మరింత నియంత్రణ సాధించడానికి, వ్యయాన్ని తగ్గించడానికి విదేశాంగ శాఖ గత రెండు సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేసింది. వాటిలో భాగంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు కొన్ని నిధులను బదిలీ చేయలేదు. పాలస్తీనా-ఇజ్రాయిల్ ప్రజల మధ్య శాంతి స్థాపన, యుద్ధ బాధితుల కోసం విదేశాలలో అందించే సాయం వంటి ఇతర కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్ల నిధులను మళ్లించారు. 'రష్యా, చైనా, ఇరాన్ దేశాలు ఉద్దేశపూర్వకంగా చేపట్టిన దోపిడీ చర్యల కారణంగా ఇంధన సరఫరాలు నిలిచిపోయాయి. మార్కెట్ అంతరాయాలు ఏర్పడ్డాయి. పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న మిత్రదేశాల ఇంధన భద్రతా అవసరాలు తీర్చడానికి ఈ నిధులను ఉపయోగిస్తాం' అని రుబియో తన మెమోలో తెలియజేశారు. కాగా ఐరాస జనాభా నిధికి తొలుత కేటాయించిన 32 మిలియన్ డాలర్లను కూడా ఇతర అవసరాలకు మళ్లించారు.
అనూహ్య, ఆకస్మిక పరిణామాలే కారణమట
ఆరోగ్య కార్యక్రమాల నిధుల విషయంలో భారీ కోతలను ఎదుర్కొంటున్న దేశాల్లో దక్షిణాఫ్రికా, టాంజానియా, జింబాబ్వే ఉన్నాయి. వీటికి 100 మిలియన్ డాలర్ల వరకూ కోత పెట్టారు. ఇక ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గాంబియా, సోమాలియా, సూడాన్, తైమూర్-లెస్టే, యెమెన్ దేశాలకు 2024 తర్వాత ఒక్క పైనా కూడా విదల్చలేదు. ఇంధన సంక్షోభం వంటి అనూహ్యమైన ఆకస్మిక పరిణామాల కారణంగా విదేశీ సాయాన్ని తగ్గించుకోవాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయితే ట్రంప్ ప్రభుత్వ తాజా బడ్జెట్ చర్యలు కాంగ్రెస్ కేటాయింపుల బిల్లుల్లో పొందుపరచిన దానికి భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా సొమ్మును ఇంధన భద్రతా అవసరాలకు, లాభాల కోసం పనిచేసే దేశీయ ప్రైవేటు కంపెనీలకు వెచ్చించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.






కామెంట్‌లు (0)