లేదంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మందితో పాదయాత్ర : ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల సమయం
ఏఐకేఎస్ అఖిలభారత
ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ హెచ్చరిక
రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆగ్రహం
-నల్లగొండ నుంచి అచ్చిన ప్రశాంత్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీలను రెండు నెలల్లో అమలు చేయాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్... రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మంది రైతులతో మహాపాదయాత్ర చేపడతామని ఆయన హెచ్చరించారు. ఏఐకేఎస్ 36వ అఖిల భారత మహాసభను పురస్కరించుకుని నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రతినిధులకు, రైతులకు, ప్రజలకు, అభివందనాలు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, సామినేని రామారావు, పలువురు అమరవీరులకు జోహార్లు అర్పించారు.
‘ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు అందిస్తాం, సాగునీరు, పంట నష్టపరిహారం, తదితర హామీలను నెరవేరుస్తాం’ అని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ 12 ఏండ్ల పాలనలో వాటన్నింటినీ విస్మరించారని విమర్శించారు. తెలంగాణలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుందా? అని ప్రశ్నించారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, తదితర దేశాలతో మోడీ సర్కారు చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ రైతాంగానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
దేశంలో రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. క్విట్ ఇండియా ఇచ్చిన డూ ఆర్ డై నినాదంతో రైతులు జీవనస్మరణ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద కాంక్షతో ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తున్న, దాడులు చేస్తున్న ట్రంప్ విధానాలకు ఘోరీ కడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి....అనే పాట పాడి సభికుల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. పాలకుల బెదిరింపులకు భయపడకుండా జెన్జీ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
దేశంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం యువకులు, ఆదివాసులు, రైతులు, ప్రజలు ఐక్యంగా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)