Magazines

‘ఎర్ర’గొండగా నల్లగొండ

14 నిమిషాల క్రితం

Nalgonda,.,
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 2 నిమిషాల చదవడం

కనువిందు చేసిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ​ఎడ్లబండ్లపై అగ్ర నేతలు

ప్రత్యేక ఆకర్షణగా థింసా, లంబాడీ నృత్యం, కోయడప్పు, కోలాటాలు

కదంతొక్కిన కర్షకులు... కనువిందు చేసిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు

ప్రత్యేక ఆకర్షణగా థింసా, లంబాడీ నృత్యం, కోయడప్పు, కోలాటాలు

మర్రిగూడ బైపాస్ నుంచి ఎన్‌జీ కళాశాల ప్రాంగణం వరకు హోరెత్తిన మహా ప్రదర్శన


​నల్లగొండ నుంచి ఎండీ సాదత్ అలీ ​

అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా నల్లగొండ నగరం ఎర్రజెండా రెపరెపలతో, రైతాంగ నినాదాలతో హోరెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది రైతులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, వ్యవసాయ కార్మికులు, ఎర్రజెండాలు చేతబట్టి కదంతొక్కారు. వివిధ రాష్ర్టాల నుంచి హాజరైన ప్రతినిధులు, పరిశీలకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఎటుచూసినా ఎర్రజెండాలే కనిపించడంతో నల్లగొండ నగరం ‘ఎర్ర’గొండగా మారింది. ఆదివారం నల్లగొండ నగర శివారులోని మర్రిగూడ బైపాస్ సెంటర్ వద్ద మహా ప్రదర్శనను ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.విజ్జూ కృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్‌జీ కాలేజ్ ప్రాంగణం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు నిర్వహించిన ర్యాలీలో కర్షకులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు, చిన్నారులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐకేఎస్‌ జెండాలు చేతబట్టి పోరాట గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.

ప్రదర్శనలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారిపొడువునా ఆదివాసీ సంప్రదాయ థింసా నృత్యాన్ని మహిళలు డప్పు దరువులకు అనుగుణంగా లయబద్ధంగా ప్రదర్శించారు. లంబాడీ సంప్రదాయ నృత్యం, మహిళల కోలాటం ఆట, పాటలతో ప్రదర్శన దద్దరిల్లింది. ఈ మహాప్రదర్శనలో మాజీ ఎంపీ బృందాకరత్, ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు డా.అశోక్ ధావలే, ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. విజ్జు కృష్ణన్, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నందాల్య నర్సింహా రెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు ఎండి జహంగీర్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. పలుచోట్ల పూలవర్షం కురిపించారు. రైతాంగ హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలు, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సాగిన ఈ ప్రదర్శన ఆద్యంతం ఉత్సాహభరితంగా, క్రమశిక్షణతో కొనసాగింది. నగరంలోని రహదారులన్నీ ఎర్రజెండాలతో నిండిపోగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సంప్రదాయ ఎడ్లబండ్లపై అగ్రనేతల రాక రైతాంగ జీవిన విధానాన్ని, పల్లె సంస్కృతిని గుర్తు చేసింది. వేలాది మంది రైతుల నినాదాలు, కళారూపాలు, ఎర్రజెండాల మధ్య సాగిన ప్రదర్శన నల్లగొండలో జాతీయ మహాసభల సందడిని చాటి చెప్పింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, ‌కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌‌వెస్లీ, ఆహ్వానసంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ఎడ్ల బండిపై ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్