మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
రైతాంగ సాయుధ పోరాట పురిటి గడ్డ నల్లగొండ ఎర్రసంద్రంగా మారిందనీ, ఈ పోరాట గడ్డ భవిష్యత్ పోరాటాలకు నాంది పలుకబోతున్నదని ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశంలో పాలకులు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విత్తనాల కోసం, కరెంటు కోసం, రుణాల కోసం, పంటలు అమ్ముకోవడం, గిట్టుబాటు ధరకోసం ఇలా అన్నింటి కోసం రైతులు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4, 500 మంది అమరులయ్యారనీ, ఆ పోరాట ఫలితంగా పేదలకు 10 లక్షల ఎకరాలను పంచారని గుర్తు చేశారు. వెట్టిచాకిరీ రద్దయిందనీ, దున్నేవాడికే భూమి అనే నినాదం పుట్టుకొచ్చిందని తెలిపారు. రైతుల పక్షాన పోరాడుతుంది ఏఐకేఎస్ నే అని గర్వంగా చెప్పారు. మహాసభల జయప్రదం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్ష మంది రైతు కుటుంబాలను, రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలను నేరుగా కలిశామనీ, వారి ఆర్ధిక సహకారంతోనే ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో రైతుల హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద సంఘం ఏఐకేఎస్ అని అన్నారు.






కామెంట్‌లు (0)