26న జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు
రైతులు, కార్మిక హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం
నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు విజయవంతం
రెండు లక్షల రైతు కుటుంబాలను కలిశాం
సహకరించిన వారికి ధన్యవాదాలు : ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతాంగం ఎదుర్కొంట్ను అనేక సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేయనున్నట్టు ఏఐకేఎస్ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ వెల్లడించారు. 26న ఏఐకేఎస్ జాతీయ కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండ ల కేంద్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించను న్నట్టు వెల్లడించారు. మహాసభకు సహకరించిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్ జాతీయ నాయకులు పి. జంగారెడ్డి, మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉడత రవీందర్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటగడ్డ నల్లగొండ పట్టణంలో ఈ నెల 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల పాటు విజయవంతంగా ముగిశాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రైతాంగ ప్రదర్శన, బహిరంగ సభకు దాదాపు లక్ష మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు.
రైతుల సహకారంతోనే మహాసభ విజయవంతం
నల్లగొండలో తొలిసారిగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సన్నాహాలు చేపట్టామని తెలిపారు. దాదాపు రెండు లక్షల రైతు కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకొని మహాసభ గురించి వివరించినట్టు చెప్పారు. రైతుల సభ రైతుల సహకారంతోనే జరగాలనే లక్ష్యంతో రైతులను భాగస్వాములను చేశామన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభ నిర్వహణకు అన్ని విధాలా సహకరించారని చెప్పారు. రైతు సంఘం కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారని చెప్పారు. ఈ మహాసభ విజయవంతానికి సహకరించిన రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు, వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, మీడియా మిత్రులు, కళాకారులు, వాలంటీర్లు, కార్యకర్తలు, నాయకులందరికీ ఆహ్వాన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రైతాంగ మహా ఉద్యమం
కేంద్ర ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువచ్చి రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధించేందుకు మహా ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలు, కరువు, పంట నష్టాలు తదితర అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నాయని తెలిపారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వేలాది మంది రైతులతో అవసరమైతే కొన్ని రోజులపాటు, కొన్ని కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు పోరాటాలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో వేలాది, లక్షలాది మంది రైతులను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తా మన్నారు. వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు మహాసభ రూపొందించిన కార్యాచరణను అమలు చేస్తామని వెల్లడించారు.
తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి
సర్‌ను రద్దు చేయాలని, తొలగించిన 14 కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా దాదాపు 93 లక్షల మంది ఓటర్లను ఇదే తరహా పరిస్థితుల్లోకి నెట్టారని, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో కార్మికుల నిరవధిక ధర్నాకు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై కూడా తీవ్ర దాడి చేస్తోందని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటాల్లో రైతాంగం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.






కామెంట్లు (0)