Magazines

బియ్యం ధరల నియంత్రణపై సర్కారు ఫోకస్‌

1 రోజు క్రితం

rice prices
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రత్యేక విక్రయ కేంద్రాల ఏర్పాటు

నిర్ణయించిన ధరలకే విక్రయాలు

హద్దులు దాటితే కఠిన చర్యలే

రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లతో విస్తృత ప్రచారం


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. బియ్యం ధరల పెరుగుదలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకుంది. కొంత మంది దళారులు బియ్యాన్ని కృత్రిమ కొరత సృష్టించి ధరలు ఆమాంతం పెంచేస్తున్నారు. దీనితో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతు న్నారు. బియ్యం ధరలు పెంచొద్దు... పెంచితే కఠిన చర్యలు తప్పవంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లతో విస్తృత ప్రచారం చేస్తున్నది. ప్రతి బియ్యం దుకాణాల్లో ఆ పోస్టర్లు అంటించేలా చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల ప్రజలకు ధరలపై అవగాహన పెంచేలా ప్రయత్నం చేస్తున్నది. మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రిం చడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందు బాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించింది. పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేం దుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా కిలో బియ్యాన్ని రూ.66, రూ.74, రూ.79 చొప్పున మూడు రకాల ధరలకు విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరల కు విక్రయిం చడం, కృత్రిమ కొరత సృష్టించే ఉద్దేశంతో సరుకులను అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలు

కృత్రిమ కొరత, ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించేందుకు ధరలపై పరిమితులు విధించడంతో పాటు, వ్యాపారుల దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిం చింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్‌), లీగల్‌ మెట్రోలాజీ అధికారులు అక్రమ వ్యాపారాలు, ధరల దోపిడీ నుంచి ప్రజలను కాపాడేందుకే ఈ దాడులు చేపట్టారు.మార్కెట్లో ధరల పెరుగుదల నుంచి వినియోగదారులను రక్షించడానికి, ప్రజలు ఎక్కువగా వాడే బియ్యం రకాలపై గరిష్ట రిటైల్ ధరలను (ఎంఆర్‌‌పీ) అధికారులు అమలు చేశారు. బీపీటీ,కేఎన్‌ఎం రకం బియ్యం ధరను కిలోకు రూ.66గా నిర్ణయించింది. ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ. 74 , అలాగే హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్‌ రకం బియ్యం కిలో ‌రూ. 79లుగా విక్రయిం చనుంది. మార్కెట్లో పారదర్శకత కోసం, మిల్లర్లు, వ్యాపారులు ప్రతి 26 కిలోల బియ్యం బస్తాపై ఈ నిర్ణయించిన ధరలను (ఎంఆర్‌‌పీ) తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశించింది.

విస్తృతంగా తనిఖీలు...కేసుల నమోదు

వినియోగదారులను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెబుతోంది. టాస్క్ ఫోర్స్ బృందాలు రైస్ మిల్లులు, హోల్ సేల్ డీలర్లు, రిటైల్ షాపుల్లో మొత్తం 1,141 ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని వారిపై ఈ తనిఖీల ద్వారా 55 కేసులు, 35 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు, తూనికలు-కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,545 తనిఖీలు నిర్వహించి, ప్రజలను మోసం చేయాలని చూసిన వారిపై 280 కేసులు నమోదు చేశారు. సామాన్య ప్రజలను మోసం చేసేందుకు వ్యాపారులు చేస్తున్న అనేక అక్రమాలను ఈ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.బస్తాలో 25 కిలోల బియ్యం మాత్రమే ఉంచి, పైన 26 కిలోల లేబుల్ అతికించి తూకాల్లో మోసం చేస్తున్న వ్యాపారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు పట్టుకుంది. అంతేకాకుండా, అసలు ధర కనిపించకుండా వాటిపై ఎక్కువ ధరల స్టిక్కర్లు అంటించడం, రేషన్ (పీడీఎస్‌) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ‌జీఎస్‌‌టీ లేదా ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేయడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.


చేసిన తప్పు పదే పదే చేస్తే పీడీ చట్టం తప్పదు

రేషన్ బియ్యాన్ని పదే పదే అక్రమంగా నిల్వ చేసే వారిపై, అలాగే మార్కెట్ ధరలను పెంచే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పదే పదే ఇలాంటి తప్పులు చేసే ఈ నేరస్థులు నిత్యావసర సరుకుల చట్టం, బీఎన్‌ఎస్‌ కింద కఠిన విచారణ, జైలు శిక్షను ఎదుర్కో నున్నారు. ఈ వారం రోజుల దాడులు కేవలం తాత్కాలికం మాత్రమే కాదు, ఎప్పుడూ కొనసాగే ప్రక్రియ అని అధికారులు తెలిపారు. మార్కెట్లలో అక్రమాలకు పాల్పడే వారికి తగిన శిక్ష పడేలా చూస్తూ, సాధారణ వినియో గదారులను రక్షించడానికి పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం తన నిఘాను కొనసాగిస్తుంది. ధరల నియంత్రణ తో పాటు సామాన్యులకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు వినియోగదారులకు కొంత ఊరటనివ్వనున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్