తెలంగాణ రాష్ట్రం కొడంగల్, మధిర హుజూర్నగర్కే పరిమితం కాదు
ముఖ్యమంత్రి
భాష తీరు మార్చుకోవాలి
తండ్రి పాత్ర పోషించాల్సిన సీఎం వివక్ష చూపొద్దు :
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ- మునుగోడు
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం తప్పదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున మరో పోరాటానికి సిద్ధమవుతానని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కొడంగల్, మధిర నియోజకవర్గాలకే పరిమితం కాదని, అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం పండబెట్టి తొక్కుతా అంటాడా..?.. ముఖ్యమంత్రి భాష తీరు మార్చుకోవాలని సూచించారు. మునుగోడులో రోడ్డు పనులకు నిధులు విడుదల కాక కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేసి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరారు.
ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల ప్రజలకూ తండ్రి పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఆ అప్పుల భారంతో ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన రూ.4 వేల పింఛన్ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మునుగోడు, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, చండూరు మండలాలు, చండూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఎంపికైన 3,630 మంది చేయూత పింఛన్ లబ్దిదారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అధికారులు మంజూరీ పత్రాలు పంపిణీ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారందరికీ పింఛన్లు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, నియోజకవర్గం లోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)