Magazines

దామగుండం ఫారెస్ట్‌లో వన్యప్రాణులకు రక్షణ కరువు

25 నిమిషాల క్రితం

Damagundam
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

వారంలోనే మూడు జింకలు మృత్యువాత

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అటవీ అధికారులు

నేవీ రాడార్ పనులతో 
రోడ్డు మీదకు వన్యప్రాణులు
ఆర్వీఆర్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే వన్యప్రాణుల బలి : 
స్థానికుల ఆరోపణ


నవతెలంగాణ-పూడూర్

నేవీ రాడార్‌ ‌ప్రాజెక్టు వన్య ప్రాణుల మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చుతోంది. దామగుండంలో జరుగుతున్న పనులతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడింది. అక్కడే జరిగే పనులతో బెంబేలెత్తిపోతున్న జింకలు, ఇతర జంతువులు ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు, కుక్కల దాడులకు బలవుతున్నాయి. వారానికి రెండు, మూడు జింకలు మృత్యువాత పడటం ఆందోళన కల్గిస్తోంది.వికారాబాద్‌ ‌జిల్లా పూడూరు మండల కేంద్రంలో దేశ రక్షణ కోసం చేపట్టిన నేవీ రాడార్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2009లో దామగుండం అటవీ ప్రాంతంలోని వందల ఎకరాల భూమిని నేవీ రాడార్ కోసం ప్రభుత్వం తీసుకుంది.

అటవీ ప్రాంతాన్ని తీసుకునే ముందు ప్రభుత్వ అధికారులు అడవికి వన్యప్రాణులకు ఎలాంటి హానీ జరగదని చెప్పారు. దామగుండం అటవీ ప్రాంతం నేవీకి అప్పగించడంతో ఫారెస్ట్ అధికారులు దామగుండం అటవీపై పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో రాడార్ పనుల వలన భారీ వాహనాలు రాకతో వన్య ప్రాణులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆహారం, నీరు లేక దామగుండంలో నీరు తాగేందుకు నిత్యం వందలాది జింకలు, వన్యప్రాణులు వస్తుంటాయి. ఈ సమయంలో వాటిపై కుక్కలు దాడి చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారంలో రెండు, మూడు జింకలు మృత్యువాత పడ్డాయి. ఇలా పదుల సంఖ్యలో జింకలు మృత్యువాత పడ్డాయి.

అధికారుల నిర్లక్ష్యం

వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు వరుస ఘటనలపై స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా, ముందస్తు నివారణా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించాలని, గాయపడిన జంతువులకు తక్షణ వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని ప్రకృతి ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

​నిత్యం ప్రమాదాలు

ఎల్‌నినో పరిస్థితుల వల్ల వ‌ర్షాల్లేక వన్యప్రాణులు నీరు తాగేందుకు దామగుండం కోనేరుకు నిత్యం వందలాది సంఖ్యలో వస్తుంటాయి. వన్యప్రాణులు నీరు తాగేందుకు వస్తున్న సమయంలో భారీ వాహనాలు నడుస్తున్న సమయంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకొని అటవీ ప్రాంతంలో అక్కడక్కడ నీటి తొట్లు ఏర్పాటు చేస్తే అవి బయటికి వచ్చే అవకాశం ఉండదు. వన్యప్రాణులను కాపాడాల్సిన ఆర్వీఆర్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.


ఆర్వీఆర్ కంపెనీ పనుల వల్లే మూగజీవులు బలి

​ ఫారెస్ట్ అధికారులు నేవీ రాడార్ పనిచేస్తున్న ఆర్వీఆర్ కంపెనీ వల్లే నిత్యం మూగజీవులు బలవుతున్నాయి. గతంలో ఎన్నో జింకలు మృత్యువాతపడ్డాయి. ఈ విషయంలో కంపెనీ యాజమాన్యం ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్యప్రాణులను కాపాడాలి. - వెంకటయ్య, పూడూరు


వారంలో రెండు, మూడు జింకలు చనిపోతున్నాయి
దామగుండం అడవిలో నిత్యం మూగజీవాలు బలవుతున్నాయి. వారంలో రెండు మూడు జింకలు చనిపోతున్నాఇ. వన్యప్రాణు లను కాపాడే బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
-రాకేష్, పూడూరు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్