కీలక మార్పులు ప్రతిపాదించిన అమెరికా
డీహెచ్‌ఎస్ భారతీయులకు తప్పని 'వీసా' ఆటంకాలు
పొడిగింపులు పొందడం కష్టమే
వాషింగ్టన్ : అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్), కార్మిక శాఖ (డీఓఎల్) పలు కీలక మార్పులు ప్రతిపాదించాయి. ఈ మార్పులు అమెరికాలో పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న భారతీయులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం విదేశీ ఉద్యోగులు... ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులు అనుమతుల పొడిగింపులు పొందడం కష్టంగా మారుతుంది. అమెరికా కంపెనీలు నియామకాల సమయంలో ముందుగా దేశీయ ఉద్యోగులకే పూర్తి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాదారులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును రద్దు చేస్తారు. అంటే ఉద్యోగం కోల్పోయిన మరుసటి రోజే వారికి ఉన్న చట్టపరమైన హోదా రద్దవుతుంది. హెచ్-1బీ, ఎల్-1 వీసా పొడిగింపు దరఖాస్తులను పరిశీలించే టప్పుడు గతంలో ఇచ్చిన ఆమోదాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రతిసారీ మొదటి నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు.
దీనివల్ల జాప్యం పెరుగుతుంది. లాటరీ ద్వారా ఎంపికయ్యే కొత్త హెచ్-1బీ పిటషన్లపై 1,03,265 డాలర్ల ఫీజు విధించాలని డీహెచ్‌ఎస్ ప్రతిపాదించింది.
ఆందోళన కలిగిస్తున్న ని'బంధనాలు'
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనలు భారతీయులకు వీసా అడ్డంకులు సృష్టిస్తాయి. గ్రీన్‌కార్డ్ తుది ప్రాసెసింగ్ కోసం దరఖాస్తుదారులు స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న నిబంధన ఆందోళన కలిగిస్తోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ సహా ఎనిమిది ప్రధాన కంపెనీలను పీఈఆర్‌ఎం ప్రోగ్రామ్ నుంచి తాత్కాలికంగా తొలగిం చడం, ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో వీసా స్పాన్సర్‌షిప్ నిలిచివేయడం వంటి చర్యలు ఇప్పటికే భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నెలలో విడుదల చేసిన వీసా బులెటిన్ ప్రకారం భారతీయులకు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ ఫైనల్ యాక్షన్ తేదీలు అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయి. ఈబీ-2 విభాగం 2013 నవంబర్ 1వ తేదీ వద్దే నిలిచిపోగా ఈబీ-3 విభాగం 2014 జనవరి 22 వరకూ మాత్రమే కదిలింది.
సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఖాతాల తనిఖీలు
విద్యార్థి వీసాలతో (ఎఫ్, ఎం, జే) పాటు హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తు దారుల సోషల్ మీడి యా, ఆన్‌లైన్ ఖాతాల తనిఖీ లను అధికారులు కఠినతరం చేశారు. మన దేశంలోని కాన్సులేట్లలో అపాయింట్‌మెంట్ల స్లాట్ల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. బీ1, బీ2 విజిటర్ వీసా దరఖాస్తు ఫీజుతో పాటు అదనంగా 250 డాలర్ల వీసా ఇంటిగ్రిటీ ఫీజు చెల్లించాల్సి రావడం భారతీయ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని మోపుతోంది.






కామెంట్‌లు (0)