Magazines

19‌న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా షురూ

16 నిమిషాల క్రితం

Life Insuranc
avatar
balaji

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రతి కుటుంబానికీ బీమా కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ

ఉపాధి పొందే వ్యక్తికి రూ.5 లక్షల బీమా

కుల, మత, ఆదాయ భేదాల్లేకుండా అమలు

17, 18 తేదీల్లో గ్రామాల్లో విస్తృత ప్రచారం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

‎రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‎గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొ న్నారు. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతి కుటుంబానికీ జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ‎ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిజమైన సార్వత్రిక జీవిత బీమా పథకమని స్పష్టం చేశారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.ఐదు లక్షల జీవిత బీమా వర్తిస్తుందని వివరించారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో, సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

‎నామినీలుగా ఒకరి కంటే ఎక్కువ మందికి అవకాశం

ఈ పథకంలో ప్రత్యేకత కేవలం బీమా పరిధికే పరిమితం కాదనీ, కుటుంబాలకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నామని భట్టి వివరించారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధి పొం దుతున్నట్లయితే ఆ వ్యక్తికి బీమా వర్తిస్తుందని చెప్పారు. ఒక కుటుంబంలో పలువురు ఉపాధి పొందుతున్నట్లయితే వారిలో ఎవరికి బీమా కల్పిం చాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని సూచించారు. ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. బీమా మొత్తాన్ని నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని అన్నారు.

‎నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి

లబ్ధిదారుల నమోదు సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భట్టి సూచించారు. బీమా పొందే వ్యక్తి పేరు, నామినీల వివరాలు సహా అన్ని వివరాలనూ కచ్చితంగా నమోదు చేయాలనీ, సంతకం తీసుకునే ముందు నమోదు చేసిన వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించి, వారి అంగీకారాన్ని నిర్ధారించుకోవాలని ఆదేశించారు. ‎పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 17, 18 తేదీల్లో గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిం చాలని సూచించారు. నమోదు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలనీ, సామాజిక మాధ్యమాలతోపాటు అన్ని రకాల ప్రసార మాధ్యమాలను వినియోగించి పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్