Magazines

ఏపీతో కుమ్మ క్కైంది మీరే

1 గంట క్రితం

colluded
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 4 నిమిషాల చదవడం

రాయలసీమ లిఫ్ట్‌ కట్టుకోమని చెప్పిందెవరు?

కృష్ణాజలాల్లో 299 టీఎంసీలకు 
 కేసీఆర్‌ ‌సంతకం చేశారు

టీడీపీతో ఏనాడో తెగదెంపులు చేసుకున్నా

బీఆర్‌ఎస్ కు గతమే.. భవిష్య‌త్‌ ఉండదు

2029లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ ‌జెండానే..

ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఇప్పిస్తా

కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ ను, టీడీపీని వెన్నుపోటు పొడిచారు

సిద్దిపేట మెడికల్ కాలేజీకి 
మదన్‌మోహన్ పేరు పెడతాం : సిద్దిపేట సభలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం

రూ.544.11 కోట్ల నిధులతో 
వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు


నవతెలంగాణ-సిద్దిపేట

‘‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది కేసీఆర్‌, హరీశ్‌‌రావు కాదా..? అప్పటి సీఎం జగన్‌‌ను ప్రగతి భవన్‌‌ పిలిచి విందు ఇచ్చి..రాయలసీమ ప్రాజెక్టు కట్టుకో అని చెప్పింది కేసీఆర్‌ ‌కాదా? కమీషన్లకు ఆశపడి రాయలసీమ ప్రాజెక్టులకు మీరు సహాకరించలేదా.? రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని .. రాయలసీమ రతనాల సీమ కావాలని చెప్పింది కేసీఆర్‌ ‌కాదా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌నేతలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌‌ పార్టీకి గతమేనని... భవిష్యత్‌ ‌లేదు అన్నారు. ప్రతి కుటుంబానికి ఇందిరా బీమా పథకాన్ని ప్రారంభించడానికి సిద్దిపేటకు వచ్చిన సీఎం,హెలిక్యాప్టర్ ద్వారా డిగ్రీ కళా శాలకు చేరుకొని, ఇందిమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అక్కడునుంచి భారీ పాదయాత్రగా సభాస్థలికి చేరుకు న్నారు. రూ.544.11 కోట్ల నిధులతో చేపట్టిన వివిద అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 2014, 2018 లో ప్రజలు మోసపోయి బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చారని, 2023 లో అధికారం కోల్పోయారని తెలిపారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్న వచ్చిందని, వారికి గతమే తప్ప భవిష్యత్‌ ఉండదని స్పష్టం చేశారు.

కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టింది మదన్మోహన్ అని, ఆయనను వెన్నుపోటు పొడిచి ‌టీడీపీలో చేరి ఎన్టీఆర్ తో కలిసి మదన్మోహన్ పై పోటీ చేసి ఓడించాడన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో మంత్రి పదవులు అనుభవించి, రెండవసారి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. 2004లో వార్డు మెంబర్ గా గెలువని హరీశ్‌ రావు... వైయస్ రాజశేఖర్ రెడ్డి దయవల్ల, కాంగ్రెస్ పార్టీ బిక్ష వల్ల మంత్రి అయ్యారన్నారు. కానీ ఆ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేకుండా అణిచివేశాడని, నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం ‌కేసీఆర్ రక్తంలోనే ఉందన్నారు. నాలుగు దశాబ్దాలుగా కేసీఆర్, హరీశ్‌‌ రావులు సిద్దిపేటను పాలించారని, ఇప్పుడు కేసీఆర్ అన్న కొడుకు ఫ్లెక్సీలు కడుతున్నాడన్నారు. వీడుపోతే వాడు.. వాడు పోతే వీడు.. రావడానికి అనాధల రాజ్యమా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసి, గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తామని అన్నారు. కేసీఆర్ తో సమకాలంలో రాజకీయాల్లోకి వచ్చిన చెరుకు ముత్యంరెడ్డి ఆయన కుటుంబం నేడు ఏ స్థితిలో ఉందని, హరీశ్‌ రావుతో సమకాలికంగా రాజకీయాలలోకి వచ్చిన సోలిపేట రామలింగారెడ్డి, జగ్గారెడ్డిల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు.

కేసీఆర్, హరీశ్‌రావులు మాత్రం వేల కోట్లు సంపాదించారని అన్నారు. టీవీలు, పేపర్లు, ఫామ్ హౌస్ లో వీరికి ఎలా వచ్చాయని, హరీశ్‌ రావు మామ హనుమంతరావుకు, బావమరిది సుమన్ రావుకు, తమ్ముడు మహే‌శ్‌ రావుకు వేల ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లక్ష్మణ్ గౌడ్ అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటే... వీరు మాత్రం వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అగ్గిపెట్టరావుకు వంద రూపాయల పెట్రోల్ దొరికింది కానీ, పది పైసల అగ్గిపెట్ట దొరకలేదని ‌హెద్దేవ చేశారు. అదే శంకరమ్మ కొడుకు శ్రీకాంతాచారి మాత్రం ఎల్బీనగర్ వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పు కనికగా మారారని, 1200 మంది ఆత్మ బలిదానాలపై, వారి తల్లుల భుజాలపై నడుచుకుంటూ పదేండ్లు అధికారంలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్, హరీ‌శ్‌ రావు, సంతోష్ రావు, కవితలు పదవులు అనుభవించారు కానీ, శంకరమ్మ కు ఎందుకు పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. తాను మహిళా కమిషన్ లో సభ్యురాలుగా పదవి ఇచ్చి, మహిళల కోసం అండగా ఉండడానికి పదవి ఇచ్చానని అన్నారు. ఐలమ్మ మనమరాలుకు మహిళా కమిషన్ చైర్మెన్‌ పదవి ఇచ్చిన‌ట్టు తెలిపారు. పదేండ్ల పాలనలో 8 లక్షల 11 వేల కోట్ల అప్పు చేశారని అన్నారు. ఒక గ్రామ సర్పంచ్ ఆ గ్రామానికి చెడు చేస్తాడా...


నాలుకోట్ల మంది అభిమానంతో ముఖ్యమంత్రిగా అయిన నేను ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తానా... ద్రోహం చేస్తే ఈ ప్రాంత బిడ్డను అవుతానా అని అన్నారు. తనను ద్రోహిగా ముద్రించడానికి ఎన్నో అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2015లో కేంద్ర మంత్రి ఉమాభారతితో కేసీఆర్, హరీశ్‌ రావు, చంద్రబాబు నాయుడులు కృష్ణా జలాల్లో ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు అన్ని ఒప్పందం చేసుకున్నారని, 2022లో ఈ ఒప్పందం మార్చకుండా ఎప్పటికీ ఉంటుందని తిరిగి ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధమన్నారు. అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్‌ పిలిచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పగించారనీ, రాళ్ల సీమను రత్నాలసీమగా మార్చడానికి సహకరించింది మీరు కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్ నుంచి వలస వచ్చి పాలమూరులో పోటీ చేసిన కేసీఆర్ ను అక్కడి బిడ్డలు గెలిపించుకుంటే, పాలమూరును అభివృద్ధి చేయలేదన్నారు. గోదావరి నీటిని వాడుకోవడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్ఆర్ తీసుకువస్తే, ప్రాజెక్టు స్థలం మార్చి, ప్రాజెక్టు పేరు కాళేశ్వరం గా మార్చి 1,50,000 కోట్ల ఖర్చుపెట్టారని, మూడేండ్లకే అది కూలిందని అన్నారు. నీవు ఒక దొంగ... నీ మామ ఒక గజదొంగ అని హరీశ్‌ రావు కేసీఆర్ లను ఉద్దేశించి అన్నారు.


బాలానగర్ లో 150 ఎకరాల భూమి నీ తమ్మునికి, మోహినాబాదులో నీ పేరు పై, నీ సతీమణి పేరిట భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నారాయణ, శ్రీ చైతన్య, ఆంధ్రా ఆస్పత్రులైన అపోలో, యశోద వంటి వాటితో పాల వ్యాపారం చేసిన దొంగవని అన్నారు. నీళ్ల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ కేసీఆర్‌ వంతు కాగా, పాల దొంగ హరీ‌శ్‌ రావు అన్నారు. నవంబర్ 26న చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట వైద్య కళాశాలకు మదన్మోహన్ పేరు పెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఇక్కడినుండే ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. కవిత తీహార్ జైలు నుండి వచ్చి ఆస్తికోసం సొంత ఇంటికి వెళితే, కేటీఆర్ మెడ పట్టి బయటకు గెంటించాడని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచే కేసీఆర్‌ కావాలో... ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ లో తాను దీక్ష చేశానని, ‌పందేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్వాసితులను ఆదుకోలేద‌న్నారు. హరీశ్‌‌రావు మామకే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యాడని, సిద్దిపేట ఎల్లమ్మ దేవి సాక్షిగా ‌బీజేపీ వాళ్లతో మంతనాలు చేయడం లేదని హరీశ్‌రావు ఒట్టు పెట్టుకుంటాడా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి ఇంటికి ధీమా వస్తుందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్