జైలు భయంతోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణలో జాప్యం
అందుకే మోడీ ముందు కేసీఆర్ మోకరిల్లారు
హైదరాబాద్ నుంచి లగచర్లకు బారులు తీరేలా తీర్చిదిద్దుతా
విద్యా, వైద్యం, ఉపాధి కోసం కొడంగల్ బాట పట్టాలి : కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
హకీంపేటలో మంత్రులతో కలిసి రైతు మేళా ప్రారంభం
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రాణహిత చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుకు నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తామని చెప్పినా తమ నియంత ధోరణితో ప్రాణహిత ప్రాజెక్టు పేరు.. ఊరు మార్చి కాసుల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరం కట్టింది కేసీఆర్. ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది... కాళేశ్వర్రావు అని గొప్పలు చెప్పించుకున్న కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడటం వల్లే కాళేశ్వరం నుంచి చుక్కనీరు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ఆ భయంతోనే ఆ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపకుండా.. కేసీఆర్ ఢిల్లీలో మోడీ ముందు మోకరిల్లి జాప్యం చేయిస్తున్నారని అన్నారు. మేడిగడ్డ పేరెత్తితే మామ, అల్లుడికి వణుకు పుడుతోందని, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు వదలాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుమేళా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ్మ, శ్రీహరిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని ప్రజలు 2009 లో కేసీఆర్ ని ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు పంపించారని గుర్తు చేశారు. దీంతో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మక్తల్ -కొడంగల్ -నారాయణ్ పేట్ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆశపడ్డారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత పదేండ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. అంతేకాక ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ సాగు, తాగు నీరు అందించాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. ఈ ప్రాంతానికి రైల్వే లైన్, సిమెంటు ఫ్యాక్టరీలతో పాటు సాగు, తాగు నీటి సరఫరాను కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కనీసం ఈ ప్రాంత పిల్లలు చదువుకునే అవకాశాలు కల్పించలేదని తెలిపారు. కానీ తమ ప్రభుత్వంలో మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నా యని సీఎం అన్నారు.
ఆనాడు ఎకరానికి రూ. 2 లక్షల పరిహారం కూడా ఇవ్వలేదని, మంత్రి శ్రీహరి రైతులకు ఎకరానికి రూ. 20 లక్షలు ఇప్పించారని గుర్తు చేశారు. ‘‘కొడంగల్ అంటే అవమానించే పరిస్థితి నుంచి.. ప్రజలు ఇచ్చిన అవకాశంతో కొడంగల్ పేరును దేశం మొత్తం పలికే అవకాశం వచ్చింది. మూడేండ్లలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా... ఢిల్లీ నుంచి నోయిడా ముంబై నుంచి పూణే వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు అదే అభివృద్ధి చేసి దేశానికే మోడల్ గా తీర్చిదిద్దుతా. కొడంగల్ ను ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతా.. తాండూరు కంది పప్పును ప్రపంచంలోని దేశాలకు ఎగుమతి చేసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా.. ఇక్కడి రైతు బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా’’ అని సీఎ రేవంత్‌రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల నేడు కరువులో రైతులకు సాగు నీరు ఇవ్వలేక పోతున్నామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు కాసుల కక్కుర్తి వల్లే మేడిగడ్డ కూలిపోయిందన్నారు.
ఈ కరువు కాలంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టుతో ప్రస్తుతం లక్షలాది ఎకరాలకు నీరందుతోందన్నారు. వాస్తవాలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు. ఎల్‌నినో, గోదావరి, కాళేశ్వరం జలాలపై చర్చించేందుకు రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు నడిపించాలని స్వీకర్‌ను సీఎం కోరారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల మొత్తం నిజాలు బయట పెడుతామన్నారు. తనను అనుకరించే ప్రయత్నం చేసేవారిని ఉద్దేశించి ఆయన ‘‘పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులి కాదు. రేవంత్ రెడ్డి కావాలంటే కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ధైర్యం ఉండాలి. పిడుగులు మీదపడ్డా నమ్మినవాడి కోసం నిలబడే తెగువ ఉండాలి’’ అని సీఎం చురకలు అంటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల మేలు కోరుతోందని, రైతులు ఆరుతడి పంటలు వేయాలని రైతులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎల్ నినో కరువును మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని అన్నారు. సంక్రాంతి తరువాత ప్రజా బలం కార్యక్రమంతో ప్రతీ గ్రామానికి వచ్చి అందర్నీ కలుస్తానని సీఎం తెలిపారు.







కామెంట్లు (0)