Magazines

కొడంగల్‌ ఎత్తిపోతల టెండర్లలో దోపిడీ

2 గంటల క్రితం

Kodangal
avatar
balaji

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ది

రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంపు

చుక్కనీరు అందకముందే ఐదు రెట్లు పెరిగిన అంచనా వ్యయం :కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరి స్తు‌న్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమ ర్శించారు. ఈ వ్యవహారంపై ఆయన సోషల్ మీడియా వేదికగా శనివారం స్పందించారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే మంత్రి పొంగులేటికి చెందిన సొంత కంపెనీ కూడా టెండర్లలో పాల్గొన్నదని ఆరోపించారు. మిగతా కంపెనీలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్న నామమాత్రపు సంస్థలని తెలిపారు. చివరకు ఒక్క కంపెనీ మాత్రమే పోటీలో మిగిలి విజయం సాధించేలా ఈ వ్యవహారం నడిచిందని విమర్శించారు.

ప్రాజెక్టు వ్యయం పెరగడంపై అభ్యంతరం

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. దాదాపు ఐదు రెట్లు వ్యయం పెరిగిందని తెలిపారు. ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ, టెండర్ల ప్రక్రియను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. టెండర్లలో పారదర్శకతకు తావులేకుండా, వారికి అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు

తెలంగాణలో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని కేటీఆర్‌ తెలిపారు. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాహుల్‌‌గాంధీ స్పందించాలి

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ దోపిడీని వివరించడానికి సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ టెండర్ల ప్రక్రియలోనూ వారికి అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్