నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రయాణీకుడు తోసివేసిన ఘటనలో గాయపడ్డ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ మణుగూరు డిపో కండక్టర్ ప్రవళికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆస్పత్రికి ఆయన శుక్రవారం వెళ్లారు. ప్రవళిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. కండక్టర్ ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందనీ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ప్రవళిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడానని వివరించారు. ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి న్యాయం చేస్తుందని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బంది పట్ల ప్రయాణికులు గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది సాధారణంగా సౌమ్యంగా, నిజాయితీగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. సిబ్బంది ప్రవర్తనపై ప్రయాణికులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆర్టీసీ యాజమాన్యానికి,అధికారులకు పిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామనీ, మణుగూరు ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనీ, బాధ్యులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం బాధ్యత అయినప్పటికీ, ఉద్యోగుల ప్రాణ రక్షణ, భద్రత అత్యంత ముఖ్యమన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఆర్టీసీకి ప్రజల మద్దతు ఎంతో అవసరం అని వివరించారు. ఈ తరహా దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదని అభిప్రాయపడ్డారు.






కామెంట్‌లు (0)