దీపావళి సందర్భంగా ప్రకటించనున్న ప్రభుత్వం
పెండింగ్‌లో 5.98 లక్షల దరఖాస్తులు
అర్జీదారుల ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుందా? అంటే అవుననే అంటున్నాయి అధికారిక వర్గాలు. ప్రస్తుతం వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులందరికీ కలిపి మొత్తం 5.98 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వీరందరికీ పింఛన్లను మంజూరు చేస్తుందా? లేదా? అనేది చూడాలి. కాగా కొత్త పింఛన్ల పంపిణీకి ఇప్పటికే అధికారులు కసరత్తులు పూర్తి చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వివిధ కేటగిరీల వారీగా అందిన దరఖాస్తులకు సంబంధించి మెజారిటీ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా.. రీవెరిఫికేషన్‌కు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కాలయాపన చోటు చేసుకుంది. కొత్తగా మూడున్నర లక్షల పింఛన్లు ఇవ్వాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించగా, మరో లక్ష, లక్షన్నర దాకా జతచేసి మొత్తం ఐదు లక్షల దాకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.
వాస్తవానికి దసరా నాటికి కొత్త పింఛన్లు ఇస్తామంటూ సీఎం, మంత్రులు చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన మేరకు పింఛన్ల మొత్తంలో పెంపుదల లేకపోయినా కనీసం కొత్తవైనా ఇస్తారని పేదలు ఆశించారు. అయితే ప్రభుత్వ ఖజానాకు కటకటగా ఉండడం, తీవ్రవర్షాభావ పరిస్థితులతో దానిపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో కొత్త పింఛన్లు ఇస్తే ప్రతినెలా అదనపు భారం తడిసిమోపెడు అవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందింది. ప్రస్తుతం ఇస్తున్న చేయూత పింఛన్ల కోసం ఏడాదికి రూ.12,000 కోట్లు (నెలకు రూ.వె య్యి కోట్ల చొప్పున) ఖర్చుచేస్తుండగా... కొత్త పింఛన్ల రూపంలో మరింత భారం పడనుంది. గత జూన్ 2 (2026) నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రథమ ప్రాధాన్యం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులకు ఇస్తామని ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు.
రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇంకా ఆచరణకు నోచుకోలేదు. సీఎం ములుగు జిల్లా పర్యటన సందర్భంగా కొందరు కొత్త లబ్దిదారులకు ప్రతీకాత్మకంగా పంపిణీ పత్రాలు అందజేశారే తప్ప... రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయలేదు. పంద్రాగస్టు నుంచే కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టు గతంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా వెల్లడించారు. అదిప్పుడు కార్యరూపం దాల్చబోతున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఆన్‌లైన్‌లో కేటగిరీల వారీగా పింఛన్లకు దరఖాస్తులు
వితంతువులు - 3,31,236
వికలాంగులు - 1,48,882
ఒంటరి మహిళలు -62,689
గీత కార్మికులు -37,381
చేనేత కార్మికులు -18,005
మొత్తం -5,98,193







కామెంట్‌లు (0)