ఎస్టీఎఫ్ మహాసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రజలు, ఉపాధ్యాయుల సమస్యలను వినేందుకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించిన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) రాష్ట్ర విద్యా మహాసభలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు సామాజిక బాధ్యతగా సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర అవకాశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టామనీ, దాదాపు 11 వేల నూతన నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి నెలా మొదటి తేదీన జీతం చెల్లిస్తున్నామని తెలిపారు. ఈహెచ్ఎస్ ను అమలు చేస్తున్నామన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులను దశలవారీగా పెంచుతూ ప్రతి నెలా రూ.750 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తున్నామనీ, డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంటినట్టు భట్టి గుర్తుచేశారు. కులాలకు అతీతంగా అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసించేందుకు వీలుగా ఒక్కో స్కూల్ ను రూ.200 కోట్లతో రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భారతీయ కుటుంబ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ విధానంలో వంద పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి విద్యార్థి అనుకూలమైన ఇంటి వాతావరణంలో చదువుకోవాలనీ, అందుకే ఇండ్లు లేని వారి కోసం రాష్ట్రంలో 8 లక్షల ఇండ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. చదువుకునేందుకు భారం కాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామనీ, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కిచ్చన్న లక్ష్మారెడ్డి, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య, ప్రొఫేసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మీ సమస్యలు చెప్పుకోవడానికి మమ్మల్నెందుకు పిలిచారు?
ఎస్టీఎఫ్ నాయకత్వాన్ని నిలదీసిన సీఆర్పీలు
ఉప ముఖ్యమంత్రి ప్రసంగం ముగించుకుని వెళ్ళిన వెంటనే సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సభలో తమ తరపున మాట్లాడేందుకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీలు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ మరికొంత మంది వక్తలు మాట్లాడాల్సి ఉన్నప్పటికీ ఆగ్రహంగా ఉన్న సీఆర్పీలు స్టేజీ పైకి ఎక్కి ఎస్టీఎఫ్ నాయకులను నిలదీశారు. సభకు వచ్చిన వారిలో 80 శాతం మంది సీఆర్పీలే ఉన్నామనీ, అయినా తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించలేదెందుకని ప్రశ్నించారు. 14 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నామనీ, ఇప్పటికీ నెలకు రూ.19,500 జీతంతో కాలం వెళ్లదీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ అసిస్టెంట్ కు ఉండే అన్ని అర్హతలు కలిగి జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా ఉన్న జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియమించబడ్డట్టు వారు వెల్లడించారు. తమ టీఏ, ఫోన్ బిల్లు ఇవ్వాలనీ, మహారాష్ట్ర మాదిరిగా సీఆర్పీల పోస్ట్ ను సూపర్ న్యూమరరీ పోస్ట్ గా క్రియేట్ చేసి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ హోదా కల్పిస్తూ రెగ్యులర్ చేయాలని కోరారు.






కామెంట్లు (0)