ముస్లిం, మైనార్టీల ఓట్లను తొలగిస్తున్నారు
బీహార్, బెంగాల్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం
బలమైన ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకోవాలి : సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశాన్ని హిందూ రాష్ర్టంగా మార్చేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అనే ప్రక్రియను కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేపట్టిందని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ‘ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) – రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లడారు. ఎన్‌ఆర్‌సీ, సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్‌లు విఫలం కావడంతో ఎలాంటి చట్టబద్దత కల్పించకుండా దొడ్డిదారిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) ద్వారా ఈ కుట్రను అమలు చేస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ 27 లక్షల మంది ముస్లిం ఓట్లను తొలగించారన్నారు. సుప్రీం మెట్లెక్కిన 1.4 లక్షల మంది కేసుల్లో 93 శాతం తప్పుగా ఈసీ ఓట్లను తొలగించిందని గుర్తు చేశారు. బీహార్‌లో సర్ మ్యాపింగ్ కాని వారిలో ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 ఆధారాలు 47 శాతం ప్రజల వద్ద లేవని అన్నారు. సర్ అంటే కనీస అవగాహన లేని అట్టడుగు వర్గాల ప్రజల వాటిని ఎలా సమర్పిస్తారని ప్రశ్నించారు.
బతికున్న వ్యక్తులు కూడా తమ ఓటు హక్కును మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఓటుహక్కును కొందరికే పరిమితం చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. దేశంలోని పరోక్ష ప్రజాస్వామం అవినీతి, డబ్బుమయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి దగ్గర ఎక్కువ నిధులుంటే వారే చట్ట సభలకు ఎన్నికవుతున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎంపీ ఎన్నికల వ్యయం రూ.95 లక్షలు కాగా, బీజేపీ అభ్యర్థులు 50 నుంచి 100 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు . దేశంలోని విపక్షాలన్నింటి కంటే నాలుగు రెట్లు బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యయం చేస్తున్నదని విమర్శించారు. రిప్రజెంటీవ్ డెమొక్రసీలో నిర్దేశిత కాలానికి ఎన్నికైన వారు వాటిని తిరిగి రాబట్టుకునేందుకు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదాని లాంటి పెట్టుబడి దారులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యక్ష ప్రజాస్యామం ఉన్న యూరప్‌లాంటి కొన్ని దేశాల్లో చట్ట సభల్లో చేసే ప్రతి నిర్ణయానికి రిఫరెండం నిర్వహిస్తారని గుర్తు చేశారు. దేశంలో అలాంటి విధానం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సర్, ఈవీఎంల ట్యాంపరింగ్ లాంటి అక్రమ పద్దతుల్లో అధికారం చేబడుతున్న బీజేపీని బలమైన ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీనియర్ సంపాదకులు కె. రామచంద్ర మూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య, ఓటర్ రిజిస్టర్ ఫోరం కన్వీనర్ సునీత, రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్య వేదిక బాధ్యులు ఇర్ఫాన్ ఖాన్, అఖిల్ సూర్య తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)