Magazines

అమ్మే..ఆధారం

12 నిమిషాల క్రితం

Mother... the source of support.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 3 నిమిషాల చదవడం

వికలాంగ సంతానానికి అన్నీ తానే...​

వయసొచ్చిన పిల్లలు..
అయినా తప్పని తిప్పలు

నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు

ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్

అమ్మే..ఆధారం. వికలాంగసంతానానికి అన్నీ తానే. వయసొచ్చిన పిల్లలు...అయినా తప్పని తిప్పలు. నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు. ఇకనైనా ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇదీ..! ఓ నిరుపేద తల్లి కన్నీటి ఆవేదన. కన్నబిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లే తల్లి మనసు... అలాంటిది ఇద్దరు కుమారులు పూర్తి అంగవైకల్యంతో జన్మిస్తే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. అయినప్పటికీ కుంగిపోకుండా, కంటికి రెప్పలా తన బిడ్డలను కాపాడుకుంటూ, వారి జీవితమే తన జీవితంగా భావిస్తూ నిరంతరం సేవలందిస్తున్న ఓ తల్లి త్యాగానికి నిలువెత్తు నిదర్శనం మహబూబాబద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం హరిపిరాల గ్రామానికి చెందిన తలారి రజిత. వివరాల్లోకి వెళ్తే.... తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలోని తలారి రజిత, రామ్మూర్తి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఇద్దరు కుమారులు తలారి అరవిందు, తలారి అరుణ్ కుమార్, ఒక పాప తలారి దీక్షిత. కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది. కొడుకులు 100 శాతం అంగవైకల్యంతో జన్మించడంతో వారి జీవితాలు చిన్నప్పటి నుంచే ఇతరుల సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కుమారుల్లో ఒకరికి 23 ఏండ్లు, మరొకరికి 19 ఏండ్లు. వయస్సు పెరుగుతున్నా వారి రోజువారీ అవసరాలను స్వయంగా తీర్చుకునే పరిస్థితి లేకపోవడంతో తల్లి రజితే వారికి అన్నీ తానై సేవలందిస్తోంది. ఇద్దరు కుమారులకు అన్నం తినిపించడం, నీళ్లు తాగించడం, వ్యక్తిగత అవసరాలు చూసుకోవడం, స్నానం చేయించడం మొదలుకొని ప్రతి పనినీ రజితే స్వయంగా చేయాల్సి వస్తోంది. వారి పరిస్థితి కారణంగా మంచంపైనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుండటంతో వారి ప్రతి అవసరాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తల్లి సేవ లందిస్తున్నారు. కొన్నిసార్లు వారి కంటి సైగలను బట్టి కూడా అవసరాలను గుర్తించి స్పందిస్తున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కుమారుల సంరక్షణే ఆమెకు ప్రధాన బాధ్యత. ఇతర పనులపై దృష్టి పెట్టడానికి కూడా వీలులేని పరిస్థితి. తల్లి పల్లిల దగ్గర లేకపోతే వారి దైనందిన జీవితం కొనసాగడం కష్టంగా మారుతోంది. ఒకవైపు ఇద్దరు కుమారుల సంరక్షణ, మరోవైపు కుటుంబ ఆర్థిక అవసరాలు.. ఇలా రజిత జీవితం నిరంతర పోరాటంగా మారింది.

ఉపాధి మార్గం లేక ఆర్థిక ఇబ్బందులు

ఇద్దరు కుమారులకు పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉండటంతో వారికి ఉపాధి అవకాశాలు లేవు. వారిని నిరంతరం చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపైనే ఉండటంతో రజిత కూడా బయటకు వెళ్లి ఉపాధి పొందే పరిస్థితి లేదు. దీంతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఇంటి వద్దే చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని, కుటుంబానికి కొంత ఆదాయం సమకూర్చుకోవాలని రజిత దంపతులు ఆశిస్తున్నారు. దుకాణం ఏర్పాటు అయితే ఇంటి వద్దే ఉంటూ కుమారులను చూసుకుంటూనే కొంతమేర ఉపాధి పొందవచ్చని భావిస్తున్నారు.

ఎమ్మెల్యే హామీ అమలుకు ఎదురుచూపులు

గతంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఈ కుటుంబ పరిస్థితిని తెలుసుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వారి ఇంటి వద్ద కిరాణా దుకాణం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఆ హామీ కార్యరూపం దాల్చి కుటుంబానికి శాశ్వత ఉపాధి మార్గం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. హరిపిరాల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు ఈ కుటుంబ పరిస్థితిని మరోసారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దాతల చేయూత కోసం ఎదురుచూపు

ఇద్దరు అంగవైకల్యంతో ఉన్న కుమారుల సంరక్షణ బాధ్యతను మోస్తూ, తన జీవితాన్నే వారి సేవకు అంకితం చేసిన రజిత కుటుంబానికి దాతలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికంగా అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇంటి వద్ద చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహాయం అందిస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒకసారి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా, ఈ కుటుంబానికి దీర్ఘకాలికంగా ఉపాధి మార్గం కల్పించే దిశగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ కుటుంబానికి సహాయం చేయదలచిన దాతలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు 9491008499 నంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హరిపిరాల గ్రామంలోని 10వ వార్డు తలారి కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు మధువన్, తన కమిటీ తరఫున ఈ కుటుంబానికి న్యాయం చేయాలని, గ్రామ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లి కిరాణా దుకాణం ఏర్పాటు సహా అవసరమైన సహాయం అందేలా కృషి చేయాలని కోరుతున్నారు.

​ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరికి తీసుకువెళ్లి సహాయం చేయాలని కోరినప్పటికీ అప్పుడున్న నాయకులు పట్టించుకో లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు పట్టించుకోని ఆ కుటుంబానికి పూర్తి భరోసా కల్పించి వారికి ఆర్థికంగా సహాయం చేసి వారికి నీడను కల్పించాలి..

- రావుల కిషన్ రెడ్డి, హరిపిరాల

జీవనోపాధి కల్పించాలి

24 ఏండ్లుగా పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్న. పిల్లలు మంచంలో పడుకోవడంతో వారికి సపర్యలు చేస్తున్న. నేను బయటికి వెళ్లి ఉపాధి పొందాలంటే పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా భర్తకు కూడా చేతులు వంకర్లు తిరగడంతో అతను కూడా ఏం పని చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రుల చుట్టూ తిరిగాము. నేడు ఈ ప్రభుత్వంలో తిరుగుతున్నాము. ఎవరు సహాయం చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి మా కుటుంబానికి జీవనోపాధి కల్పించాలి..

- తలారి రజిత

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్