గతేడాదితో పోలిస్తే ఆరు శాతం క్షీణత అంచనా
పెట్టుబడికి తగిన లాభాలు లేక ఇతర పంటల వైపు రైతుల మొగ్గు
గోధుమ సాగుకు అన్నదాతలు దూరం
26 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గనున్న సాగు విస్తీర్ణం
న్యూఢిల్లీ : దేశంలో గోధుమ సాగు తీవ్ర సంక్షోభంలో పడుతోంది. పదేండ్లకు పైగా కాలంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఈ ఏడాది రుతుపవన వర్షాలు కురవడం, భూగర్భ జలాలు అడుగంటడం, గోధుమకు కనీస మద్దతు ధర పెంపు నామమాత్రంగా ఉండటం రైతులను ఆలోచనలో పడేస్తున్నాయి. గోధుమ సాగును తగ్గించి శనగ, ఆవాలు, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో 2026-27 పంట సీజన్లో గోధుమ సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశంలో గోధుమ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 26 ఏండ్లలో గోధుమ సాగులో ఇదే అతిపెద్ద క్షీణత కానుంది.గతేడాది గోధుమ సాగు 3.36 కోట్ల హెక్టార్లలో జరిగింది. ఈసారి అది 3.15 కోట్ల హెక్టార్లకు పడిపోవచ్చని అంచనా. 2000-01 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో సాగు విస్తీర్ణం తగ్గడం ఇదే తొలిసారి కానుంది. ఇప్పటికే నవంబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా 50 లక్షల హెక్టార్లలో మాత్రమే గోధుమ విత్తనం వేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 15.3 శాతం తక్కువ కావడం గమనార్హం.
లాభాలు లేని గోధుమ సాగు
నీటి కొరతతోపాటు ఇతర పంటల ధరలు కూడా రైతుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గోధుమతో పోలిస్తే శనగ, ఆవాల ధరలు మెరుగ్గా ఉండటంతో వాటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. యూపీ చెందిన ఓ పిండి మిల్లు నిర్వాహకుడు సందీప్ బన్సాల్ మాట్లాడుతూ.. సాధారణంగా రైతులు గోధుమ సాగుకే ప్రాధాన్యం ఇస్తారనీ, అయితే ఈ ఏడాది ఇతర పంటల్లోనే ఎక్కువ ఆదాయం లభిస్తోందని వివరించారు.మరోవైపు, గోధుమను కొనుగోలు చేసే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధరను ఈ ఏడాది ఒక శాతం మాత్రమే పెంచి క్వింటాల్‌కు రూ.2,610గా నిర్ణయించింది. 2002-03 తర్వాత ఇంత తక్కువ పెంపు ఇదే తొలిసారి. సాధారణంగా ఏటా 5 నుంచి 6 శాతం పెంచే మద్దతు ధరను ఈసారి నామమాత్రంగా పెంచడం కూడా రైతులను గోధుమ సాగు నుంచి వెనక్కి నెడుతోందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దిగుబడులపై ప్రభావం
ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గుతుండగా, రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో దిగుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌లో ఉత్పత్తి తగ్గితే దేశీయ మార్కెట్లో గోధుమ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి మరింత సవాలుగా మారనుందని నిపుణులు చెప్తున్నారు.
వర్షాభావంతో కష్టాలు
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన నైరుతి రుతుపవన వర్షాలు పదేండ్లకు పైగా కాలంలో ఎన్నడూ లేనంత తక్కువగా నమోదయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రధాన గోధుమ పండించే రాష్ట్రాల్లో సాధారణం కంటే 41 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూమిలో తేమ తగ్గి సాగునీటి కొరత తీవ్రంగా మారింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన రైతు విలాస్ భుటేకర్ మాట్లాడుతూ.. గోధుమ పంటకు కనీసం నాలుగైదుసార్లు నీరు పెట్టాల్సి ఉంటుందనీ, ప్రస్తుతం విత్తనాలు వేసేందుకే సరిపడా నీరు అందుబాటులో లేదని తెలిపారు. అందుకే తక్కువ నీటితో పండే శనగ పంటను ఎంచుకున్నామని చెప్పారు.






కామెంట్లు (0)