నాతో సమస్యలుంటే ఇన్‌చార్జికి ఫిర్యాదు చేయండి
అంతే తప్ప పార్టీకి నష్టం చేయొద్దు
మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పని చేద్దాం
రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిని ఈసారికి వదిలేద్దాం : కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పార్టీ అధిష్టానం ఆదేశాలను నూటికి నూరు శాతం పాటిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేతప్ప ప్రభుత్వంలోగాని, పార్టీలోగానీ తన వైపు నుంచి వ్యక్తిగత నిర్ణయాలు ఉండబోవని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఎవరికైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే హైకమాండ్‌కు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చాచార్జికి ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. అంతేతప్ప పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పూనుకోవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఎమ్ సందీప్ ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సందీప్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి సీఎంతోపాటు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...
మంచిని మైక్‌లో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. కార్యకర్తల కృషి, పట్టుదల వల్ల 2023లో అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు సందీప్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉంటారని వివరించారు. అందువల్ల పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఆయనకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూ చాచించారు. ఆఖరికి మంత్రులతో సమస్యలు ఉత్పన్నమైనా ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. వారి పేర్లను బయటపెట్టకుండా ఆయన అంతర్గతంగా చర్చించి, సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. అలాగాకుండా బహిరంగంగా ఇష్టాను సారంగా వ్యాఖ్యలు చేయటం వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని హెచ్చరించారు. కాగా ఇటీవల పార్టీపైన, ప్రభుత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యవహారం పీఏసీ సమావేశంలో చర్చకొచ్చింది. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు నేతలు కోరినట్టు సమాచారం. అయితే వారిద్దరినీ ఈ ఒక్కసారికి వదిలేద్దామంటూ సీఎం సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇంకెప్పుడైనా పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుం దామంటూ ఆయన నచ్చజెప్పారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.






కామెంట్‌లు (0)