Magazines

ఆదివాసీలకు అండగా ఎర్రజెండా

22 నిమిషాల క్రితం

Adivasis
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 3 నిమిషాల చదవడం

వలసలుపోతే హక్కులు కోల్పోవాలా? 

పోడుసాగుదారులకు హక్కుపత్రాలివ్వాలి : 
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

ఫారెస్టు భూముల సాగు ఆదివాసీల హక్కు : మాజీ ఎంపీ బాబూరావు

వలసొచ్చిన వారికి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిందే

హక్కుల కోసం అసెంబ్లీని ముట్టడిస్తాం


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ హక్కుల కోసం పోరాడుతున్న వలస ఆదివాసీలకు ఎర్రజెండా అండగా ఉంటుందనీ, ప్రభుత్వం దిగొచ్చి వారి సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ప్రకటించారు. ఆదివాసీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. సోమవారం హైదరాబాద్‌‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివాసీలు మహాప్రదర్శన నిర్వహించారు. ఆదివాసీ పురుషులు విల్లంబులు ఎక్కుపెట్టి...కొమ్ము డోలు కళాకారులు ప్రదర్శనలు చేస్తూ ముందుకు సాగారు. మహిళలు ఆదివాసీ నృత్యప్రదర్శన చేశారు. ఈ మహాప్రదర్శనకు వేలాది మంది ఆదివాసీలు తరలొచ్చారు. తమ మాండలికంలో నినాదాలు చేశారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అధ్యక్షతన జరిగిన సభలో జాన్‌‌వెస్లీ మాట్లాడారు. ఆదివాసీలు అడవుల్లో ఒకచోట స్థిర నివాసం ఉండకుండా సంచరిస్తూ జీవిస్తారనీ, వారు తరుచూ ఒక చోట నుంచి మరో చోటుకు వలస వెళ్తారని చెప్పారు. ఆదివాసీలు తమ వారు కాదని చత్తీస్‌‌గఢ్‌ ‌ప్రభుత్వం....తమ రాష్ట్రం వారు కాదని తెలంగాణ ప్రభుత్వం అనటం సరిగాదన్నారు.


బతకడం కోసం వలసెళ్తే హక్కులను తీసేస్తారా? ఇదేం న్యాయం? 30 ఏండ్ల నుంచి ఉంటున్నవారు మనుషులు కాకుండా పోతారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వారికి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. అదే విధంగా విద్యా, వైద్య, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఖనిజ సంపద లూటీ చేసేందుకు అంబానీ, అదానీల కోసం అడవుల్లో రోడ్లు వేయడానికి చట్టాలు అడ్డురావుగానీ...ఆదివాసీ గూడాలకు రోడ్లు వేయడానికి, నీటి, విద్యుత్‌ ‌సౌకర్యాలు కల్పించడానికి నిబంధనలు అడ్డొస్తాయా? అని ప్రశ్నించారు. అడవులను దోచుకునే కార్పొరేట్లకు అండగా ఉండటం...అడవిలో పుట్టి...అడవిలో పెరిగి..ప్రత్యేక అనుబంధంతో అడవులను సంరక్షించే ఆదివాసీలపై పాలకులు దాడులు చేయించడం దుర్మార్గమని విమర్శించారు. ఆదివాసీలు ఓట్లేస్తేనే సీతక్క గెలిచి మంత్రి అయ్యారనీ, ఇప్పుడు వారి హక్కుల కోసం ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. ఆదివాసీలు తమ హక్కుల కోసం తెగబడి పోరాడాలని పిలుపునిచ్చారు.

పోడుసాగుదారులపై ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలి: ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ ‌

వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వాలనీ, పోడు సాగుదారులపై ఫారెస్టు అధికారుల దాడులను ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ ‌కోరారు. పోడు భూముల్లోకి వెళ్లకుండా ఫారెస్టు అధికారులు కందకాలు తవ్వడాన్ని ఆపాలనీ, ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ ‌చేశారు. సర్‌‌ పేరుతో ఆదివాసీ ఓట్లను తొలగించొద్దన్నారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పాలడుగు భాస్కర్‌, బండారు రవికుమార్‌, రాష్ట్ర నాయకులు టి.స్కైలాబ్‌‌బాబు, ఆశయ్య, ఆర్‌.వెంకట్రా ములు, అరుణజ్యోతి, కృష్ణారెడ్డి, ఎ.వెంకటేశ్‌, టి.నాగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి ఆదివాసీ నేత, మాజీ ఎంపీ మిడియం బాబూరావు

ఆదివాసీ తెగకు చెందిన సీతక్క మంత్రి కావడం గొప్ప విషయమేననీ, అయితే ఆదివాసీలకు ఆమె ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆదివాసీ నేత, మాజీ ఎంపీ మిడియం బాబూరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయలో 13 రకాల తెగలుంటాయనీ, నిజమైన ఆదివాసీలు అబద్ధాలు చెప్పకుండా విలువలతో బతుకుతారని చెప్పారు. ఎన్నికల ముందు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇప్పిస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందనీ, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల ముందు ఒకలా...అధికారంలోకి వచ్చాక ఒకలా మాట్లాడటం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ఫారెస్టు భూముల్ని సాగు చేసుకోవడం ఆదివాసీల హక్కు అనీ, ఇది అటవీ హక్కుల చట్టంలోనే పొందు పర్చారని గుర్తుచేశారు. ఆదివాసీలకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయనీ, పోడు వ్యవసాయం ఆ తెగల సాంప్రదాయం కాబట్టి వారికి హక్కు పత్రా లివ్వాలని పొందుపర్చిన విషయాన్నీ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా ఒక్క ఆదివాసీకి కూడా పోడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదని విమర్శించారు. ఆదివాసీలపై ఫారెస్టు అధికారుల దాడులను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబితే ఫారెస్టు అధికారులు వినరా? అని ప్రశ్నించారు.








ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్