Magazines

ఆసరా పింఛన్ల పెంపు ఇంకెప్పుడు?

30 నిమిషాల క్రితం

pensions
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 3 నిమిషాల చదవడం

కొత్తగా 4.5 లక్షలు మంజూరు

మూడేండ్లలో 5,73,625 మందికి కొత్త పింఛన్లు

రూ.2వేలు పెంచితే రూ.1,080 కోట్ల అదనపు భారం

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెంపుపై సర్కార్‌ మల్లగుల్లాలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా 4.5 లక్షల పింఛన్లను రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి ఈ నెల 8న కొడంగల్‌ ‌బహిరంగసభలో లబ్దిదారులకు మంజూ రు పత్రాలను అందజేశారు. మూడేండ్లలో కేటాయించిన 1,23,625 మంది పింఛన్లతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి వివిధ కేటగిరీల కింద 5,73,625 మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసింది. అదే సందర్భంలో మరణించిన వారు, అనర్హులను గుర్తించి 2 లక్షల మందిని తొలగించింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో పెంపు వల్ల ఖజానాపై రూ.1.080 అదనపు భారం పడనుంది. పింఛన్ల మొత్తాన్ని రూ.2వేలు పెంచుతారని ఆశపడ్డ వారికి సర్కార్‌ ‌నిర్ణయం నిరాశను మిగిల్చింది. ​ రాష్ట్రంలో 2025-26 లెక్కల ప్రకారం 42,08,129 మంది ఆసరా పింఛన్ దారులు ఉన్నారు. వృద్ధులు, వితంతు వులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా, డయాలసిస్‌ మొదలగు 11 రకాల వారికి ఈ పథకం కింద ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

వికలాంగులకు రూ.4,116 మినహా మిగతా 10 కేటగిరీల్లోని వారికి రూ.2,116 అందిస్తున్నారు. అయితే 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆసరా పింఛన్ దారుల సాయాన్ని రూ. 2 వేలు పెంచడంతో పాటు కొత్తగా అర్హులకు మంజూరు చేస్తామని ప్రకటించింది. అధికారం చేపట్టినప్పటి నుంచి మూడు దఫాలుగా లబ్దిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించింది. 2023 ‌ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా 24.84 లక్షల మంది, 2026 జూన్‌‌లో 10.22 లక్షల మంది, 2026 ఆగస్టులో 5.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మూడు దఫాల్లో కలిసి 40.91 లక్షల దరఖాస్తులు రాగా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత, గీత కార్మికులు మొదలగు ఆరు కేటగిరీల్లో అర్హులైన వారికి కొత్తగా 4.5 లక్షల పింఛన్లు మంజూరు చేశారు. కొత్తగా ఎంపికైన వారికి ఈ నెల 19న నగదును ఖాతాలో జమ చేయనున్నారు. ఏయిడ్స్‌, డయాలసిస్‌ మొదలగు అత్యవసరమైన వారికి మూడేండ్లలో 1,23,625 పింఛన్లను మంజూరు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి వివిధ కేటగిరీల కింద 5,73,625 మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. మరణించిన వారు, అనర్హులను గుర్తించి మూడేండ్లలో రెండు లక్షల మందిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. కొత్తగా మంజూరైన వారితో కలిపి దాదాపు రాష్ర్టంలో ప్రస్తుతం 46,58,129 మంది ఆసరా పథకం ద్వారా పింఛన్లు పొందనున్నారు. ​ వెయ్యి కోట్ల అదనపు భారం రాష్ట్రంలో ఉన్న 42,08,129 మంది ఆసరా పింఛన్ దారులకు ప్రభుత్వం ఏటా రూ.రూ.994.50 కోట్లు వ్యయం చేస్తోంది. అత్యధికంగా వికలాంగులకు రూ.4,016, వృద్ధులు, వితంతువులకు 2,016 చొప్పున మొత్తం మూడు కేటగిరిల్లో 34,89,963 మంది లబ్దిదారులకు రూ. 842.66 కోట్లను సర్కార్‌ ఏటా ఖర్చు చేస్తోంది. కొత్తగా పెంచిన 4.5 లక్షల పింఛన్‌ ‌దారులతో కలిపి లెక్కిస్తే సర్కార్‌‌పై ఏటా రూ.1,080 కోట్ల అదనపు భారం పడనుంది.


ఒకే సారి ఇవ్వాలి

కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లను లబ్దిదారులకు ఒకే రోజు మంజూరు పత్రాలతో పాటు మొత్తాన్ని బ్యాంక్‌ ‌ఖాతాలో జమ చేయాలి. గతంలో ప్రత్యేక కేటగిరీ కింద మంజూరు చేసిన పింఛన్ల పంపిణీలో సర్కార్‌ ‌నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ సారి అలా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సక్రమంగా పంపిణీ చేయాలి.
-ఎం.అడివయ్య, ఎన్పీఆర్డీ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి



2025-26 లెక్కల ప్రకారం రాష్ర్టంలో ఆసరా పింఛన్ దారులు


కేటగిరి లబ్దిదారుల సంఖ్య ప్రతి నెలా వ్యయం(కోట్లలో)

1. వృద్ధులు 14,95,320 317.98

2. వితంతువులు 15,09,793 324.69

3. వికలాంగులు 4,84,850 199.99

4. గీత కార్మికులు 61,855 13.14

5. చేనేత కార్మికులు 35,177 7.36

6. ఏయిడ్స్ రోగులు 34,401 6.94

7. ఫైలేరియా బాధితులు 17,277 3.48

8. డయాలసీస్ 4,011 0.81

9. బీడీ వర్కర్లు 4,21,797 89.22

10. ఒంటరి మహిళలు 1,39,838 30.04

11. బీడి టేకేదార్లు 3,812 0.85

మొత్తం 42,80,129 రూ.994.50

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్