రిజర్వేషన్లకు కేంద్రం తూట్లు
2,631 ఖాళీలు భర్తీ చేయరా?.. 80 శాతానికి పైగా అగ్రవర్ణ అధ్యాపకులే
వేలాది మంది రిజర్వుడు అభ్యర్థులు దరఖాస్తు చేసినా నియామకాలు శూన్యం
మోడీ ప్రభుత్వ రిజర్వేషన్‌ల నిర్వీర్యానికి ఆర్టీఐ గణాంకాలే సాక్ష్యం
దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ప్రచారం పొందుతున్న ఐఐటీల్లో కులవివక్ష వేళ్లూనుకుపోయింది. సామాజిక న్యాయం, సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులుగా ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం అణగారిన వర్గాలకు అన్యాయమే ఎదురవుతోంది. రిజర్వేషన్ల అమలును పర్యవేక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఐఐటీల్లో అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : దేశంలోని 17 ఐఐటీల్లో 80 శాతానికి పైగా అధ్యాపకులు అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కేటాయించిన 2,631 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ వర్గాలకు చెందిన వేలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నియామకాలు చేపట్టడం లేదు. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉంటోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో కొనసాగుతున్న కులాధిపత్యాన్ని బయటపెట్టాయి.
అగ్రవర్ణాల ఆధిపత్యం
ఈ నేపథ్యంలో ప్రణవ్ జీవన్ పి. అనే పరిశోధకులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద 23 ఐఐటీలకు దరఖాస్తు చేశారు. వీటిలో 17 సంస్థలు మాత్రమే సమాధానాలు ఇచ్చాయి. అక్టోబర్‌లో సేకరించిన వివరాల ప్రకారం.. ఐఐటీల్లో 80 శాతానికి పైగా అధ్యాపకులు అగ్రవర్ణాలకు చెందినవారే. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఈ సంఖ్య 91 శాతంగా ఉంది. అనేక విభాగాల్లో ఒక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుడు కూడా లేరు. సామాజిక అసమానతలపై బోధించే హ్యుమానిటీస్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రిజర్వుడు వర్గాల నుంచి అర్హులైన అభ్యర్థులు రావడం లేదనే వాదనను ఐఐటీలు వినిపిస్తున్నాయి. కానీ ఆర్టీఐ గణాంకాలు ఈ వాదనను తప్పుబడుతున్నాయి. 2025 నుంచి వచ్చిన అధ్యాపక ఉద్యోగ దరఖాస్తుల్లో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులవే. ఐఐటీ గువహతిలో ఈ సంఖ్య 80 శాతానికి మించింది. అయినప్పటికీ నియామకాలు చేపట్టలేదు. గువహతిలోని హ్యుమానిటీస్ విభాగానికి 161 మంది ఓబీసీ, 100 మంది ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసినా ఒక్కరినీ ఎంపిక చేయలేదు.
నామమాత్రంగానే ఎస్సీ, ఎస్టీ సెల్స్
విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారా నికి ఏర్పాటు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ సెల్స్ కూడా చాలా చోట్ల నామమాత్రంగానే ఉన్నాయి. 17 ఐఐటీల్లో కేవలం రూర్కీ, భిలాయ్ మాత్రమే ఫిర్యాదులు, అవగాహన కార్యక్రమాలు, నిధుల కేటాయింపులపై వివరాలు ఇచ్చాయి. ఆరు ఐఐటీల్లో అసలు ఈ సెల్స్ కూడా లేవు. మరోవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) మాత్రం చురుగ్గా పనిచేస్తున్నాయి. చట్టబద్ధమైన నిబంధనలు ఉంటేనే సంస్థలు స్పందిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. అందుకే ఎస్సీ, ఎస్టీ సెల్స్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం
మానసిక ఆరోగ్య సేవల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రతి 500 మంది విద్యార్థులకు ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు ఉండాలన్న యూజీసీ మార్గదర్శకాన్ని కేవలం మూడు ఐఐటీలు మాత్రమే పాటిస్తున్నాయి. ఐఐటీ బీహెచ్‌యూలో ప్రతి 4,750 మంది విద్యార్థులకు ఒక కౌన్సిలర్ మాత్రమే ఉన్నారు. గత ఐదేండ్లలో నమోదైన 21 ఆత్మహత్యల్లో 11 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
ఫలితమివ్వని 'మిషన్ మోడ్'
మొత్తం అధ్యాపక పోస్టులు, ఖాళీలను కలిపి రిజర్వేషన్ నిబంధనల ప్రకారం లెక్కిస్తే.. అనుమతించిన వాటికి మించి 928 మంది అగ్రవర్ణ అధ్యాపకులు కొనసాగుతున్నట్టు, మరోవైపు 2,631 రిజర్వుడు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. 2022లోనూ ఇదే తరహా ఆర్టీఐ వివరాలు బయట పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. రిజర్వేషన్ల అమలుకు 2022 నుంచి కేంద్రం చేపట్టిన
మిషన్ మోడ్ నియామకాల ఆదేశాలు
కూడా ఫలితం ఇవ్వలేదు.
కొరవడిన సామాజిక న్యాయం
దేశంలో విద్యా ప్రమాణాలకు ప్రతీకలుగా చెప్పుకునే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) సామాజిక న్యాయానికి మాత్రం దూరంగా ఉంటున్నాయి. ప్రముఖ ఐఐటీల్లో చదువుతున్న దళిత, ఆదివాసీ, వెనుకబడిన తరగతుల విద్యార్థులు కులవివక్ష, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఐఐటీ బాంబేలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఈ సమస్యను మరోసారి చర్చకు తెచ్చింది. ఆయన తల్లిదండ్రులు ఓ అధ్యాపకుడిపై కులవివక్ష, వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే, విచారణ పూర్తికాకముందే పలువురు ఐఐటీ అధ్యాపకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మద్దతుగా నిలవడం విమర్శలకు తావిచ్చింది.
నియామకాల్లో జాప్యాన్ని అరికట్టలేని మోడీ సర్కారు
ఐఐటీల్లో రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కేంద్ర విద్యాసంస్థల (ఉపాధ్యాయుల కేడర్‌లో రిజర్వేషన్లు) చట్టం-2019 కూడా దీనిని స్పష్టం చేస్తోంది. అయినా మోడీ ప్రభుత్వం నియామకాల్లో జాప్యాన్ని అరికట్టలేకపోతోంది. ఖాళీగా ఉన్న రిజర్వుడు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే విభాగాలపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ సెల్స్‌కు చట్టబద్ధత కల్పించాలని, కులవివక్షను అర్థం చేసుకునే శిక్షణ పొందిన కౌన్సిలర్లను నియమించాలని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.






కామెంట్‌లు (0)