కలెక్టర్‌ను అడ్డుకున్న రైతులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతల బైటాయింపు
వారంలో సమస్యను పరిష్కరిస్తామన్న కలెక్టర్
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతిని అడ్డుకున్నారు. వివిధ గ్రామాల రైతులు సర్వేల్ సమీపంలోని ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. ఆందోళనకు సిద్ధమవుతుండగా అదే మార్గం నుంచి సర్వేల్ గ్రామానికి కలెక్టర్ అనురాగ్ జయంతి వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్‌ను అడ్డుకున్నారు. పోలీసులు సముదాయించడంతో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు, తహసీల్దార్ పరిశీలించి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారం రోజుల్లో సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెళ్లిపోయారు. నిరసన కార్యక్రమంలో రైతులు గుజ్జ మాజీ సర్పంచ్ మైల యాదిరెడ్డి, వీరమల్ల జంగయ్య గౌడ్, నలపరాజు పద్మ స్వామి, వర్ధం నాగార్జున, వెనుముల జగన్ రెడ్డి, కరెంటోతు రాందాసు కరెంటోతు పాండు, ఊడుగు పెంటయ్య, వర్ధం యాదయ్య, వెనుముల దామోదర్ రెడ్డి, వెనుముల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)