అమ్మకాలను విరమించుకోకుంటే ఉమ్మడి పోరాటం
హుడా ట్రక్ పార్క్ భూముల వేలం ఆపాల్సిందే
22, 23న నిరాహార దీక్షలు 25న హెచ్ఎండీఏ ముట్టడి 27న వేలం అడ్డగింత : సీపీఐ(ఎం) రౌండ్ టేబుల్ సదస్సులో జాన్‌వెస్లీ, కూనంనేని, హరీశ్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజా ప్రయోజనాల కోసం దశాబ్దాల కిందట రైతుల నుంచి సేకరించిన హైదరాబాద్‌లోని కూకట్పల్లి హుడా ట్రక్ పార్క్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్, రియల్ ఎస్టేట్ శక్తులకు కట్టబెట్టాలని చూడటాన్ని సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్షాలు, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తక్షణమే 3.15 ఎకరాల భూముల ఈ-వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఈ నెల 22, 23 తేదీల్లో నిరాహార దీక్షలు, 25న హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి, 27న జరిగే వేలం పాటను క్షేత్రస్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించాయి. సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సదానందం ప్రసంగించారు.
రైతుల భూములను వేలం వేసే హక్కు ప్రభుత్వానికి లేదు : జాన్‌వెస్లీ
ప్రజా ప్రయోజనాల నిమిత్తం 1980-81లో నాటి ప్రభుత్వం మూసాపేట్, కూకట్పల్లి రైతుల నుంచి 33 ఎకరాలను సేకరించి ట్రక్ పార్క్ ఏర్పాటు చేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గుర్తుచేశారు. ఇది ప్రభుత్వ సొంత జాగ కాదని, రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూమిని వేలం వేయడమేంటని ప్రశ్నించారు. ప్రజా అవసరాలకు వాడకపోతే తిరిగి ఆ భూములను రైతులకే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.99 కోట్ల కనీస ధర నిర్ణయించడం వెనుక వందల కోట్ల రియల్ ఎస్టేట్ దందా దాగి ఉందన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ టవర్లు కట్టడానికి భూములు లేవంటున్న ప్రభుత్వం.. వేలాది ఎకరాలను కార్పొరేట్లకు ఎందుకు అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ప్రజల కోసం క్రీడా మైదానం, ఆస్పత్రులు, విద్యాసంస్థలు నిర్మించాలని సూచించారు. 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను డీఎల్ఎఫ్ సంస్థకు కట్టబెట్టాలని చూస్తే వామపక్షాలు, బీఆర్ఎస్ కలిసి అడ్డుకున్నాయని, ఇప్పుడు మళ్లీ అమ్మాలని చూస్తే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని జాన్‌వెస్లీ స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు.. కూనంనేని
ప్రభుత్వ భూముల అమ్మకాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, సంపద సృష్టించకుండా భూములు అమ్ముకుంటూ పోతే భవిష్యత్ శూన్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
భూముల చుట్టూ తిరుగుతున్న రేవంత్‌రెడ్డి : హరీశ్‌రావు
సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే, భూముల చుట్టూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 25 వేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని తెలిపారు. కాప్రాలో 400 గజాలను సైతం బస్తీ దవాఖానకు ఇవ్వకుండా వేలం వేయడం సిగ్గుచేటన్నారు. కూకట్పల్లి ట్రక్ పార్కులో రోజూ 500 ట్రక్కులు ఆగుతాయని, దీనిపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ప్రజలకు గాలి పీల్చుకోవడానికి ఉన్న ఏకైక ఓపెన్ ల్యాండ్ ఇదేనని, దానిని అమ్మేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముంబైలో వర్సిటీ భూములను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల కోసం బ్రోకర్లకు రూ.250 కోట్ల ముడుపులు చెల్లించారని విమర్శించారు.
వామపక్షాలు చేపట్టే పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. పది లక్షల జనాభా ఉన్న కూకట్‌పల్లిలో ఉన్న ఏకైక స్థలాన్ని అమ్మకానికి పెడితే ప్రజల గతేంటని ప్రశ్నించారు. అక్కడున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్టీఏ, ఏసీపీ కార్యాలయాలను సైతం ఖాళీ చేయిస్తారా అని ప్రశ్నించారు.. వామపక్ష నేతలు గోవర్ధన్, సదానందం మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలతోనే ఈ వేలాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఐలాపురం రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు శంకర్, సంతోష్, లింగస్వామి, నాయకులు విజయ, ధర్మారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.ఉమామహేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)