– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అగ్రకులాలవారు రజక కుటుంబ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకునే సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత దారుణ ఘటన జరిగితే పోలీసులు బాధితుల ఫిర్యాదు తీసుకోకుండా, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారని విమర్శించారు. బహిరంగంగా పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జిల్లా ఎస్పీ, డీఎస్పీ, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పసిబిడ్డను హత్య చేసిన సర్పంచ్‌తో పాటు నిందితులందరిపై కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పక్షపాతంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హోం శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ ఘటనపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాదితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో నేడు జరిగే రాష్ట్రవ్యాప్త నిరసనల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కుమ్మెర ఘటనకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్త నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



