Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై స్టేటస్‌కో

ఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై స్టేటస్‌కో

- Advertisement -

హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఇలాపూర్‌ తండాలో ఇండ్ల కూల్చివేత ప్రయత్నాలపై తెలంగాణ హైకోర్టు స్టేటస్‌ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ఈ మేరకు శనివారం తన ఇంటి వద్ద విచారణ జరిపిన అనంతరం మధ్యంతర ఆదేశాలు వెలువరించారు. గజ్జా రంగారావు సహా 12 మంది పిటిషనర్లు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో తమ ఇండ్లను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేయడానికి అధికారులు తీసుకునే చర్యలను అడ్డుకోవాలని కోరారు. ఐలాపూర్‌ తండాలోని సర్వే నం.119 పరిధిలో తమ ఇండ్లు దశాబ్దాలుగా ఉన్నాయనీ, పూర్వీకుల కాలం నుంచే నివసిస్తున్నామని తెలిపారు. 1956 నుంచే ఆ భూముల్లో ఉంటున్నారని చెప్పారు. పన్నులు, విద్యుత్‌, నీటి బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, అకస్మాత్తుగా హైడ్రా యంత్రాంగం బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. శనివారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో హైడ్రా, పోలీసు సిబ్బంది బుల్డోజర్లు, జేసీబీలతో అక్కడికి చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారన్నారు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండా చర్యలు చేపట్టారని వాదించారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలను సెలవుల్లోనే ఎందుకు చేపడతారంటూ హైడ్రాను ప్రశ్నించారు. సెలవు రోజుల్లో కూల్చివేతలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారని అడిగారు బుల్డ్‌డోజర్‌ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చినా హైడ్రా వైఖరిలో మార్పు ఎందుకు రావడం లేదన్నారు. ఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులను వెలువరించారు. పిటిషన్‌లో.. ఐలాపూర్‌ తాండలో సర్వే నెం.119లో సుమారు మూడు వేల మంది ఉన్నారు. వంద గజాల జాగాలోనే నివాసం ఉండే పేదవాళ్లు, రోజూ కూలిపనులు చేసుకునేవాళ్లు, నిరక్షరాస్యులు… పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఇండ్లకు విద్యుత్తు, నీటి పన్నులు చెల్లిస్తున్నారు. ఎలాంటి సమాచారం, నోటీసు లేకుండా శనివారం తెల్లవారు జామున 2 గంటలప్పుడు హైడ్రా మూడు వేల మందితో వచ్చి కూల్చివేత చర్యలు చేపట్టింది. హైడ్రాకు చెందిన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆయుధాలు, బుల్‌డోజర్లు, జెసీబీలు, ఇతర యంత్రాలతో కూల్చివేత చర్యలు మొదలుపెట్టారు. బలప్రయోగంతో ఖాళీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఐలాపూర్‌ తాండ సర్వే నెం.119లో స్టేటస్‌కో కొనసాగించాలని హైడ్రాకు ఆదేశాలిచ్చింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.
రూల్స్‌ ప్రకారమే కంచె
ప్రభుత్వ భూములపై కంచె ఏర్పాటు చేయాలంటే చట్టబద్ధమైన విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది. ‘ప్రభుత్వ భూమి’ అన్న పేరుతో నియమాలు పక్కనబెట్టి యథేచ్ఛగా కంచెలు వేయడం అనుమతించబోదని స్పష్టం చేసింది.నిషేధిత జాబితాలో ఉందనే కారణంతోనే భూములకు కంచె వేయడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. సంబంధిత భూమి నిజంగా ప్రభుత్వానికి చెందినదనే ధృవీకరణ, అవసరమైన అనుమతులు లేకుండా కంచె వేయకూడదని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 1.26 ఎకరాల భూమికి హైడ్రా కంచె వేసిన చర్యను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎన్‌.సబిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ, ఒక వ్యాపారవేత్త ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని తమ భూమిని నిషేధిత జాబితాలో ఉందని పేర్కొంటూ కంచె వేసి, బోర్డులు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. తమ ఆస్త్తిలో జోక్యం చేసుకోవద్దని, ఇప్పటికే ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కేవలం నిషేధిత జాబితా ఆధారంగా కంచె వేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కంచె వేయడానికి ముందు ఆ భూమిపై ఏవైనా వివాదాలు లేదా కేసులు ఉన్నాయా? అన్నది నిర్ధారించుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని హైడ్రాను ఆదేశించిన కోర్టు, ఉత్తర్వుల ప్రతులను హైడ్రా కమిషనర్‌తో పాటు ప్రభుత్వానికి పంపాలని రిజిస్ట్రీకి సూచించింది. కలెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
చెరువుల్లో గురప్రు డెక్క తొలగించాలి: హైకోర్టు
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ చెరువులో పేరుకుపోయిన గురప్రు డెక్కను వెంటనే తొలగించి, దోమల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశించింది. సరూర్‌నగర్‌ చెరువుతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర చెరువులన్నింటిలోనూ ఇలాంటి మలినాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. చెరువుల్లో పేరుకుపోయే గురప్రు డెక్క వల్ల దోమలు విస్తరించి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని కోర్టు పేర్కొంది.దోమల నియంత్రణలో భాగంగా ఫాగింగ్‌, లార్వా నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చేపట్టిన చర్యలపై వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని కోరుతూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. సరూర్‌నగర్‌ చెరువులో గురప్రు డెక్క సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన రాలేదని సైదాబాద్‌కు చెందిన డి. కీర్తికిరణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌ కుమార్‌ విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ, సరూర్‌నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసెంబ్లీలోనే ఈ సమస్యను ప్రస్తావించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దోమల సంఖ్య అధికమవడంతో ఆ ప్రాంతంలో నివాస పరిస్థితులు దెబ్బతిన్నాయని వివరించారు. పిటిషనర్‌ సమర్పించిన ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి, ప్రజాప్రతినిధి అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించినా అధికారులు స్పందించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పట్టణ నిర్వహణలో భాగంగా చెరువుల శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత హైడ్రాపై ఉందని వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్‌ చెరువులో గురప్రు డెక్క తొలగింపుపై స్థితిగతుల నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -