ఢిల్లీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ : అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఎఇఎల్)కు సంబంధించిన వార్తలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా జర్నలిస్టులు, మీడియా పోర్టల్లను నిరోధిస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీలోని జిల్లా కోర్టు గురువారం మధ్యంతర స్టే విధించింది. ఇలాంటి నిషేధ ఆదేశాలు ఇచ్చేముందే ప్రతివాదులైన జర్నలిస్టులకు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఎఇఎల్‌కు సంబంధించిన ధ్రువీకరణ లేని, పరువునష్టం కలిగించే కథనాలు తొలగించాలని ఈ నెల 6న ప్రత్యేక సివిల్ కోర్టు జడ్జి అనుజ్‌కుమార్ సింగ్ జారీ చేసిన ఎక్స్-పార్టే ఇంజక్షన్‌ను సవాల్ చేస్తూ జర్నలిస్టులు రవి నాయర్, అబీర్ దాస్ గుప్తా, అయస్కాంత్ దాస్, ఆయుష్ జోషి చేసిన అప్పీల్‌ను రోహిణి కోర్టు జిల్లా జడ్జి అశీష్ అగర్వాల్ విచారించారు. ఇలాంటి నిషేధ ఆదేశాలు జారీ చేసే ముందు ప్రతివాదులకు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని జిల్లా జడ్జి గుర్తించారు. ‘సుదీర్ఘంగా సాగిన గత విచారణలో అదానీపై కథనాలను, పోస్టులను ప్రశ్నించినప్పటికీ, నిషేధ ఆదేశాలు జారీ చేసే ముందు ప్రతివాదులకు వాదనలు వినిపించే తగిన అవకాశం ఇవ్వలేదు.
నా అభిప్రాయం ప్రకారం, కథనాలు పరువు నష్టం కలిగించేవని, వాటిని తొలగించాలనే ఆదేశాలు జారీ చేసే ముందు సివిల్ జడ్జి ఆ అవకాశాన్ని మంజూరు చేసి ఉండాలి’ అని జిల్లా జడ్జి తెలిపారు. అలాగే, ఏ నిర్దిష్ట కంటెంట్ పరువు నష్టం కలిగించేదో గుర్తించకుండా సివిల్ కోర్టు విస్తృత పరిధిలో నిషేధాజ్ఞలను జారీ చేసిందని జర్నలిస్టులు తమ అప్పీల్‌లో తెలిపారు. కాగా, ఈ నెల 6 నాటి సివిల్ కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ ఈ నెల 16న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదానీ ఎంటర్ ప్రైజస్‌కు పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని వివిధ వార్త సంస్థలను, స్వతంత్ర జర్నలిస్టులను ఆదేశించింది. ఈ నోటీసుల్లో 138 యూట్యూబ్ లింక్‌లు, 83 ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ఉన్నాయి. తొలగింపు నోటీసులు అందుకున్న వారిలో న్యూస్‌లాండ్రీ, ది వైర్, హెచ్‌డబ్ల్యూ న్యూస్ వంటి సంస్థలు, రవిష్ కుమార్, అజిత్ అంజుమ్, థకుర్తా, ధ్రువ్ రథీ, అకాశ్ బెనర్జీ వంటి వ్యక్తులున్నారు. మెటా, గుగూల్ లకు నోటీసు కాపీలను పంపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్య వర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు 2021 ప్రకారం వ్యవహరించడానికి ఈ సంస్థలను మధ్యవర్తులుగా ఉంచారు.
సివిల్ కోర్టు ఆదేశాలపై ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర ఆందోళన
ఎఇఎల్‌కు సంబంధించిన ధ్రువీకరించని, పరువునష్టం కలిగించే కథనాలు, పోస్టులను తొలగించాలని వివిధ మీడియా, సోషల్ మీడియా సంస్థలను ఆదేశించడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను కేంద్ర మంతిత్వ శాఖ అమలు చేయడాన్ని ‘సమస్మాత్మకం’ అని విమర్శించింది. ‘మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు కార్పొరేట్ సంస్థకు ఎలాంటి కంటెంట్‌కు సంబంధించిన లింకులను మధ్యవర్తులకు లేదా ప్రభుత్వ ఏజెన్సీలకు పంపే అధికారిన్ని ఇస్తున్నాయి. దీంతో ఇలాంటి కంటెంట్‌ను 36 గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది’ అని గిల్డ్ పేర్కొంది. తొలగింపు ఆదేశాలను మంత్రిత్వ శాఖ అమలు చేయడంతో పాటు, ఒక కార్పొరేట్ సంస్థలకు అటువంటి విస్తృత అధికారాన్ని ఇవ్వడం మీడియాపై సెన్సార్‌షిప్‌ను ప్రారంభించే ప్రమాదం ఉందని గిల్డ్ హెచ్చరించింది. ‘స్వేచ్ఛా, నిర్భయమైన ప్రెస్ ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. ప్రైవేట్ ప్రయోజనాలు కోసం విమర్శనాత్మక, ఇబ్బంది కలిగించే కథనాలను ఏకపక్షంగా నిషేధించడానికి అనుమతించే ఏ వ్యవస్థ అయినా ప్రజలు తెలుసుకునే హక్కుకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది’ అని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది.