Tuesday, May 20, 2025
Homeజాతీయం'ఉక్కు' ప్రయివేటీకరణ కుట్రలు సాగనివ్వం

‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలు సాగనివ్వం

- Advertisement -

– నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు దారుణం
– సమ్మెకు దేశవ్యాప్త మద్దతు : తపన్‌సేన్‌

విశాఖ : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ప్రయివేటీకరణ కుట్రలు సాగనివ్వబోమని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. సోమవారం ఆయన విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ కో-కన్వీనర్‌ కుమార మంగళంలతో కలిసి విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు యాజమాన్యం కాంట్రాక్టు, పర్మినెంట్‌ కార్మికులపై నేరపూరితమైన వేధింపులకు పాల్పడుతోందని తెలిపారు. నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, పర్మినెంట్‌ కార్మికులపై, కార్మిక సంఘాల నాయకులపై సస్పెన్షన్లు, షోకాజ్‌ నోటీసులతో కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. వీటిని ఖండిస్తూ నేటి (మంగళవారం)నుంచి జరగనున్న సమ్మెకు దేశ వ్మాప్తంగా మద్దతు లభిస్తోందని చెప్పారు. అన్ని ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల కార్మికులు ఈ సమ్మెకు మద్దతిస్తున్నారని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.11,400 కోట్ల ప్యాకేజీ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించడానికి కాదని, ప్రయివేట్‌ వ్యక్తులకు ప్లాంట్‌ను అమ్మేసే కుట్ర అందులో దాగి ఉందని అన్నారు. ప్లాంట్‌ అప్పును రీషెడ్యూల్‌ చేయడానికి ప్యాకేజీ ఇచ్చినట్టు వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానిది కాదని, ఇది పూర్తిగా పీపుల్స్‌ ప్లాంట్‌ అని తెలిపారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఈ ప్లాంట్‌ను అమ్మే హక్కు కేంద్రానికి లేదన్నారు. దేశంలోని ప్రయివేట్‌ ఉక్కు పరిశ్రమలకు సొంత గనులున్నాయని, ప్రభుత్వ రంగ విశాఖ ఉక్కుకు మాత్రం పాలకులు ఐరన్‌ ఓర్‌, కోల్‌ మైన్స్‌ ఇవ్వడం లేదని తెలిపారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తిని తగ్గించకుండా, ప్లాంట్‌ను రక్షించుకోవాలని ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం వేధింపులు ఆపడం లేదని, అందుకే కాంట్రాక్ట్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారని తెలిపారు. సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా విశాఖ ఉక్కులో కార్మికులు ఉత్పత్తిని ఆపకుండా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, అవసరమైతే ఉత్పత్తిని ఆపైనా నిరవధిక సమ్మెను కొనసాగించడానికి వెనుకాడరని తెలిపారు. ఎనిమిది నెలలుగా 25 శాతం జీతాలనే కార్మికులకు యాజమాన్యం ఇస్తోందని, దీనిపై టీడీపీ కూటమి పార్టీల నాయకులు కనీసం మాట్లాడటం లేదన్నారు.
పోలీసుల యత్నాన్ని తిప్పికొట్టిన కార్మికులు
సోమవారం సాయంత్రం స్టీల్‌ప్లాంట్‌ స్మృత్యంజలి కూడలి వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సభ జరిగింది. ఈ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించాచు. అయితే, కార్మికులు ఐక్యంగా ఈ ప్రయత్నాలను తిప్పికొట్టారు. తపన్‌ సేన్‌తో సహా పలువురు కార్మిక నేతలు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ నుంచే కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఈ సభలో ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యులు మంత్రి రాజశేఖర్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ, సీఐటీయూ నాయకులు వైటి.దాస్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి జి.గణపతి రెడ్డి, కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ నాయకులు నమ్మి రమణ మాట్లాడారు. సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, 78వ వార్డు సీపీఐ(ఎం) కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్‌ ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -