ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలన
తహసీల్దార్లకు మార్గదర్శకాలు జారీ
ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ
రేషన్ షాపుల వారీగా ఏరివేత
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిరుపేదలు కడుపునిండా అన్నం పెట్టేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కొత్త రేషన్‌కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. అనర్హులకు రేషన్‌కార్డులు ఉన్నట్టు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుమానిత రేషన్‌కార్డుల జాబితాలను పౌర సరఫరాల అధికారులకు పంపించింది. ఆ మేరకు మండలాల వారీగా అనర్హులను గుర్తించి రెవెన్యూ అధికారులకు జాబితాలను పంపించారు. ఈ క్రమంలో రేషన్ షాపుల వారీగా అనర్హులను గుర్తించి కార్డుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగం వచ్చిన వారు, నాలుగెకరాలకుపైన వ్యవసాయ భూమి ఉండటం, అత్యధిక వార్షిక ఆదాయం, రెండు రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్న వారిని గుర్తిస్తున్నారు.
రేషన్ కార్డుల సంఖ్య భారీగా పెరగడం.. సన్న బియ్యం అర్హులకు మాత్రమే అందాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిత రేషన్ కార్డులను తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. జనవరిలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ షాపుల వారీగా కేటాయించిన రేషన్‌కార్డుల పరిశీలనను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. అనర్హులను గుర్తించి కార్డును పూర్తిగా రద్దు చేయడం లేదా కార్డులో ఉన్న వ్యక్తులను తొలగించడం చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 356 రేషన్ షాపుల ద్వారా 4687.905 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2,25,843 రేషన్ కార్డులు ఉండగా.. 7,40,557 మందికి లబ్ది చేకూరుతోంది. ప్రస్తుతం ఇందులో ఉద్యోగం వచ్చిన వారు, 4 ఎకరాలకుపైన వ్యవసాయ భూమి ఉన్న వారు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా అత్యధికంగా వార్షిక ఆదాయం ఉన్న వారిని, రెండు రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్న వారిని తొలగిస్తున్నారు.
పక్కదారి పట్టకుండా చర్యలు
గతంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండి రేషన్‌కార్డు పొందారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడం, ఆదాయం ఎక్కువ పెరిగినప్పటికీ రేషన్‌కార్డు కలిగి ఉన్నవారిని అధికారులు ఏరుతున్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు రేషన్‌కార్డులో ఉండటంతో వారి పేరుతో ప్రభుత్వం నుంచి బియ్యం అలాట్‌మెంట్ అవుతోంది. చాలా మందికి ఇటీవల ఉద్యోగాలు రావడంతో కొందరు స్వచ్ఛందంగా రేషన్‌కార్డుల నుంచి తమ పేర్లు తొలగించుకున్నారు. కొంత మంది అలాగే కొనసాగుతుండటంతో కేటాయించిన బియ్యం పక్కదారి పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతి నెలా వందల క్వింటాళ్ల బియ్యం నల్ల బజారుకు తరలుతోంది. వందల క్వింటాళ్లు పక్క రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు. దీన్ని అరికట్టి అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం అందజేయాలనే లక్ష్యంతో తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
పరిశీలనలో గుర్తించిన వారే తొలగింపు
రేషన్‌కార్డు ఉన్న వారి కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లైతే వారి కార్డును తొలగిస్తున్నారు. రూ.8 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం ఉన్న వారిని గుర్తిస్తున్నారు. అదే విధంగా తెల్ల రేషన్‌కార్డు ఉండి కారు ఉన్న వారి కార్డు కూడా తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా వచ్చిన జాబితా ఆధారంగా రేషన్ షాపుల వారీగా అనర్హులను గుర్తిస్తున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాక తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధి కారికి నివేదిస్తారు. ఆ నివేదిక ఆధారంగా అనర్హుల రేషన్ కార్డులను తొలగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
పరిశీలన కొనసాగుతోంది
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే సస్పెక్టెడ్ రేషన్ కార్డుల జాబితాను పంపింది. జిల్లాలో మొత్తం ఇవి 4182 ఉన్నట్టు జాబితా వచ్చింది. వాటిని రెవెన్యూ అధికారులకు పంపించాం. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించాక అనర్హులను గుర్తించి తొలగిస్తాం. అర్హులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతినెలా మంజూరు చేస్తున్నాం.
నందిని- ఆదిలాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి



