Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

- Advertisement -

సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు శైలజ రామయ్యర్‌కు వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో చేనేత జౌళి శాఖ కమిషనర్‌ శైలజ రామయ్యర్‌ను తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీ మేరకు నేతన్నలను రుణ విముక్తులను చేయాలని నెల్లికంటి సత్యం కోరారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 527 చేనేత సహకార సంఘాలున్నాయనీ, టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరిగి చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కూరుకపోయాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సంఘాలు మూతపడటంతో కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. చేనేత సహకార సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేసి బ్యాంకుల ద్వారా కొత్త రుణ సహాయం అందించాలనీ, మూతబడిన సంఘాలన్నింటినీ తెరిపించాలని విన్నవించారు. టెస్కోకు, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. టెస్కో నిర్వహణ బాధ్యతలు, ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాలనీ, సహకార సంఘాల పై భారం వేయకూడదని కోరారు. లక్ష చేనేత కుటుంబాలకు ఏడాది పొడవునా చేతినిండా పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనీ, చేనేత గ్రామాల్లో డిజైన్లు, రంగుల అద్దకం పై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మగ్గాలపై నేసిన వస్త్రాలను కొనుగోలు చేసే ప్రజలకు ప్రభుత్వం 30 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలనీ, గుంత మగ్గం స్థానంలో ఫ్రేమ్‌ మగ్గాలు, ఆధునిక పరికరాలు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ పథకంలో చేనేత కార్మికులకు వర్క్‌ షెడ్లు మంజూరు చేయాలనీ, చేనేత వస్త్రాలపై జీరో జీఎస్టీ అమలు చేయించాలని విన్నవించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శైలజా రామయ్యార్‌ హామీనిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.లక్ష్మీ నరసయ్య, గౌరవాధ్యక్షుడు వెంకట్‌ రాములు, అధ్యక్షుడు పెండెం సర్వేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -