జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి..
నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటిని (ఆర్జీయూకేటీ) మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం బాసర పర్యటనలో భాగంగా మంత్రి క్యాంపస్‌ను సందర్శించి, సుమారు రూ.1.50 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా మంత్రి మాట్లాడారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలన్నారు. భరతనాట్యం, కూచిపూడి, సంగీతం, సాహిత్యం వంటి విభాగాల్లోనూ విద్యార్థులు రాణించాలని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటికి అవసరమైన నిధులు సమకూరుస్తామని తెలిపారు. విద్యార్థుల సమస్యల పై సానుకూలంగా మంత్రి స్పందించారు.పరిష్కరించగలిగిన వాటిని వెంటనే చర్యలు తీసుకుంటానని, మిగతావి సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.
నేటి యువత చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఒడిదొడుకులు సహజమని, విఫలమైతే ఆగిపోవడం కాదు, మళ్లీ లేచి నిలబడాలంటూ విద్యార్థులను ప్రేరేపించారు. మొబైల్ ఫోన్లలో మునిగితేలుతూ విలువైన సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. పండగలు, ఆటపాటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు.
బాసర ట్రిపుల్ ఐటి సాంస్కృతిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులతో భోజనం చేసి, కొత్త యూని ఫామ్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు అన్ని విభాగాల్లోనూ నాణ్యమైన విద్య, వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్,మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే లు విఠల్ రేడ్డి, నారాయణ రావు పటేల్,భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వీసి గోవర్ధన్, అధ్యాపకులు, అధికారులు, పాల్గొన్నారు.