నవతెలంగాణ – భూపాలపల్లి
తుఫాను కారణంగా తడిసిన దాన్యం కొనుగోలు, దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం టేకుమట్ల మండలం కుందనపల్లిలో తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, తడిసిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో ముకాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ…తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అసలు అధైర్యపడవద్దని స్పష్టం చేశారు. తడిసిన దాన్యం పారాబాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని సూచించారు.
దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవ నివేదికలను సమీకరించాలని ఆదేశించారు. ఆ నివేదికలను పరిహారం చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింస్తామని తెలిపారు. కుందనపల్లిలో రైతుల సౌకర్యార్థం ఐకేపి తరఫున శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తుఫాను వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కుందనపల్లి వాగును పరిశీలించిన కలెక్టర్, వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో అనిత, వ్యవసాయ అధికారి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

 
                                    