సీడబ్ల్యూసీ సూచనల మేరకు కొత్త డిజైన్లు
20 రోజుల్లో పనులు ప్రారంభం
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూడు బ్యారేజీల ప్రస్తుత క్షేత్ర స్థాయి పరిస్థితులను అధికా రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతు ల్లో పనులు చేపట్టేందకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు. మేడిగడ్డ కుంగి పోవడానికి, సుందిళ్ళ అన్నారం బ్యారేజ్‌ల లీకేజ్‌లకు గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్‌లు పేర్కొన్నాయని తెలిపారు.
సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌పై కూడా ఆరోపణలు వచ్చిన నేపద్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఐఐటీ అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా జియో ఫిజికల్, హైడ్రాలిక్ టెస్ట్‌లు నిర్వహించి పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో బ్యారేజీల్లో నీరు చేరిందనీ, 15 నుంచి 20 రోజుల్లో పరీక్షలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఐదు సంస్థలను ఎంపిక చేసి అందు లో మూడింటిని ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు. డ్యామ్ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు సాంకేతిక సంస్థలతో అనుభందం ఉన్న సంస్థలను ఎంపిక చేస్తామని తెలిపారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందు గా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డిజైన్ల లోపాలు, పనుల నిర్లక్ష్యం, ఆర్థిక అవకతవకలపై సంబం ధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్, చనకా-కోరాట, దేవాదుల, చిన్న కాళేశ్వరం, సీతారామ సాగర్, ఎస్‌ఎల్‌బీసీ హెలిబోర్న్ సర్వే, డిండిలతో పాటు జూరాల వద్ద నిర్మించ తల పెట్టిన ప్రత్యమ్యాయ బ్రిడ్జి, సింగూర్ కాలువ లైనింగ్ పనులను ఆయన ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. పనుల పురోగతి, క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆడిత్యా నాధ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



