ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్
ఉన్నత విద్యలో 5 శాతం కేటాయింపులు
ఇందిరమ్మ ఇండ్లలోనూ 5 శాతం రిజర్వేషన్
ఆరేండ్లలోపు వారికి ఉచితంగా సర్జరీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక వికలాంగుల సంక్షేమం దిశగా అడుగులు వేసింది. అంతకు ముందు వికలాంగుల సంక్షేమం కోసం ఉన్న జీవోలు అమలు కాకపోవడంతో టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్‌గా ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలను నిర్వహించారు. గతంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్ 3)కు ముఖ్యమంత్రి హాజరయ్యే వారు కాదు. ఈ నేపథ్యంలో వీరయ్య నాయకత్వంలో వికలాంగులకు అవగాహన కల్పించి, చైతన్యం తెచ్చారు. ఈ క్రమంలో వికలాంగుల సంక్షేమం కోసం హస్తం పార్టీ ఇచ్చిన హామీల అమలుకు వారు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వికలాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మొదటి అడుగు వేశారు.
వికలాంగుల సంక్షేమశాఖకు మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ సహకారంతో ఆ శాఖలో కొత్త జీవోలను తేవడంతో పాటు వాటిని సమర్థంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత విద్యలో 5 శాతం, కోర్టు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లను వికలాంగులకు అవకాశం కల్పించారు. దేశంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుంచి వికలాంగులకు ప్రతి సంవత్సరము ఉచితంగా అందించే త్రిచక్ర మోటార్ వెహికిల్స్ 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యానికి అందించేలా జీవో నెంబర్ 89 ఇచ్చి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. వీటితోపాటు బ్యాటరీ వీల్ చైర్లు, బ్యాటరీ సైకిల్, బిజినెస్ ఎంపవర్ కార్ట్స్ లాంటి అనేక పరికరాలు 40 శాతం వైకల్యానికి అందించేలా జీవోలో పొందుపరిచారు. ఇదే జీవోలో గత ప్రభుత్వ కాలంలో ఉన్న కఠినమైన నిబంధనలు అన్ని సడలించారు. వికలాంగులందరూ వారికి కావలసిన ఉపకరణాలను పొందేలా మార్చారు.
పార్లమెంటరీ వ్యవస్థ ఆమోదించిన వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులకు 40 శాతం వైకల్యం ఉంటే వికలాంగుల సంక్షేమంలో ప్రయోజనం పొందవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉపకరణాలు 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యానికి ఇవ్వడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ 40 శాతం వైకల్యానికి పరికరాలు ఇవ్వడం లేదు. ఇది వికలాంగుల సంక్షేమములో దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు. దేశంలో మరెక్కడా లేని విధంగా వికలాంగులు- వికలాంగులను వివాహాలు చేసుకుంటే కల్యాణ లక్ష్మితో పాటు అదనంగా లక్ష రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. వైకల్యంతో జన్మించిన ఆరు సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారికి అవసరమయ్యే అధునాతనమైన వైద్య సౌకర్యాలను కల్పిస్తూ అవసరమైతే శస్త్ర చికిత్సలు చేసి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడం లక్ష్యంగా బాలభరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.వివిధ శాఖల్లో పని చేస్తున్న వైకల్యం కలిగిన ఉద్యోగులు ఎక్కడైతే వారు ఉద్యోగం చేస్తున్నారో అదే స్థానంలో ప్రమోషన్ పొంది ఎలాంటి స్థాన బదిలీ లేకుండా అక్కడే ఉద్యోగం చేసుకునేలా జీవో నెంబర్ 34 ను తెచ్చారు.
ఇదే జీవోలో తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగుల తల్లిదండ్రులకు కూడా ఈ లబ్ధి పొందేలా పొందుపరిచారు. వీటితో దేశంతో పాటు, అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. 50 రకాల వ్యాపారాల్లో ఏదైనా చేసే విదంగా బ్యాటరీ ట్రైసైకిళ్లను బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ గా మార్చి అందించబోతున్నారు. వీటితోపాటు మొబైల్ బిజినెస్ వాహనాలను కూడా ఇవ్వనున్నారు. కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్న అంధ విద్యార్థులకు ఆధునాతన హై ఎండ్ ల్యాప్ టాప్‌లను, టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్‌లను అందిస్తున్నారు. ఒక ఏడాదిలోనే తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుంచి 2 వేల ట్రై మోటరైజ్డ్ స్కూటీలతోపాటు బ్యాటరీ వీల్ చైర్స్, బ్యాటరీ ట్రై సైకిళ్లు,ఇన్నవేటివ్ బ్యాటరీ వీల్ చైర్లు, హై ఎండ్, ఎండ్ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, క్రచెస్, వినికిడి యంత్రాలు, లెప్రసీ వారికి ప్రత్యేకంగా తయారు చేయబడిన చెప్పులు, బిజినెస్ ఎంపవర్ కార్ట్స్, మొబైల్ బిజినెస్ ఆటోలు ఇలా దాదాపు 8,000 మంది వికలాంగులకు ఉచితంగా అందించడానికి సిద్ధం చేశారు. జిల్లాల వారీగా లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తి చేశారు. ఒకేసారి మూడు పీఆర్సీలు ఉద్యోగులకు అందేలా విడుదల చేశారు.
వికలాంగుల కార్పొరేషన్ మొదటి బోర్డు మీటింగ్‌లో ఈ అంశాన్ని చేర్చి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 2010 పీఆర్సీ, 2015 పీఆర్సీ, 2020 పీఆర్సీలకు వికలాంగులు నోచుకోలేదు. ఇందిరమ్మ ఇండ్లలోనూ 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రూ.50 వేల సబ్సిడీతో రూ.ఒక లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షల రుణాలు అందించారు. వికలాంగుల శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించగానే వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎదిగేలా ఒక్కో గ్రూపుకు రూ.15 వేల చొప్పున రూ.3 కోట్లకు పైగా అందించే ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో రాష్ట్రంలో 6 వేల వికలాంగుల పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. 18 వేల వికలాంగుల పొదుపు సంఘాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వికలాంగులైన క్రీడాకారులను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నది.
పారా స్పోర్ట్స్ క్రీడాకారిణి వికలాంగురాలు దీప్తి జీవాంజి పారా ఒలంపిక్ పోటీల్లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. ఆమెకు కోటి రూపాయల నజరానా, 500 గజాల ఇండ్ల స్థలము, గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చారు. నూతన స్పోర్ట్స్ పాలసీలో పారా స్పోర్ట్స్ పాలసీలు చేర్చారు వికలాంగుల కోసమే ప్రత్యేకంగా కొన్ని క్రీడలకు ప్రోత్సాకాలను అందించిన చట్టాలు చేశారు. ఇప్పుడు ఎవరైనా పారా క్రీడాకారులు ప్రపంచస్థాయి పోటీలలో ఒక స్వర్ణం నెగ్గితే ఆరు కోట్ల రూపాయలు తోపాటు ఉద్యోగము ఇంటి స్థలం పొందేలా సదుపాయాలు కల్పించబడ్డాయి. పారా క్రీడలను ప్రోత్సహిస్తూ శిబిరాలను నిర్వహిస్తూ మెరుగైన ప్రదర్శన ఇచ్చిన క్రీడాకారులను ఎంచుకుని ఉత్తమమైన ట్రైనింగ్ ఇచ్చి పోటీలకు సిద్ధం చేసేలా తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుంచి రూ.50 లక్షల బడ్జెట్ కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
నాడు ఛిద్రమైన జీవితాలు..నేడు వికసిస్తున్న బతుకు చిత్రాలు : ముత్తినేని వీరయ్య
వికలాంగుల సంక్షేమానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లలో రూ.64 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ సర్కారు రెండేండ్లలో రూ.100 కోట్లు కేటాయించిందని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. ఈ కేటాయింపులే వికలాంగుల పట్ల బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్ మధ్య ఉన్న తేడా అని చెప్పారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాడు ఒడి (అదర్ డ్యూటీ) సౌకర్యం కల్పించాలని కోరితే బీఆర్‌ఎస్ సర్కార్ 10 ఏండ్లు నిరాకరిస్తే, ప్రజా ప్రభుత్వం 2025 డిసెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం, వికలాంగుల సంక్షేమం కాంగ్రెస్ మాటల్లోనే కాదు. చేతల్లోనూ చూపించిందనీ, చూపిస్తుందని వీరయ్య తెలిపారు.



