ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు మెడికల్ కళాశాలల్లో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైపెండ్‌ల దోపిడీని అరికట్టాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రయివేటు మెడికల్ కళాశాలలు కార్పొరేట్ సంస్థలుగా మారి విద్యార్థుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు నిర్దిష్టమైన స్టైపెండ్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రయివేటు మెడికల్ కళాశాలలు నెలల తరబడి ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని స్టైపెండ్ చెల్లింపులపై ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బకాయిలను వెంటనే చెల్లింపజేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు అవసరమైతే విస్తృత ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రయివేటు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఉత్తర్వులు, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘిస్తు న్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని అన్నారు. స్టైపెండ్ చెల్లింపుల విషయంలో విద్యార్థులను బెదిరించడం, అకాడమిక్ ఒత్తిళ్లు తీసుకొచ్చి వారి గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది ఆర్థిక దోపిడీ మాత్రమే కాకుండా యువ వైద్యుల భవిష్యత్‌పై దాడి అని అన్నారు. సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ రెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, అర్బన్ డెవలప్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.విజరుకుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.మహేష్, రాష్ట్ర కార్యదర్శి పోడపంగి నాగరాజు, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు డా.ఎస్.నాగేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్, ఉపాధ్యక్షులు నాగేందర్, పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.
స్టైఫండ్ దోపిడీని అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



