Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగాజా మారణహోమం ఆపండి

గాజా మారణహోమం ఆపండి

- Advertisement -

అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచానికి పెను ప్రమాదం
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలి : వామపక్ష కార్మిక సంఘాల డిమాండ్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గాజా మారణహోమాన్ని వెంటనే ఆపాలనీ, పాలస్తీనాను స్వతంత్ర రాజ్యంగా గుర్తించాలని వామపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (డబ్ల్యూఎఫ్‌టీయూ) 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తాలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ, ఏఐసీసీటీయూ, టీయూసీసీ, యూటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, గాజా దాడులను వెంటనే ఆపాలి, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలి అంటూ ప్ల కార్డులు, జెండాలు పట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ పాలస్తీనాలోని యురేనియం, ఆయిల్‌ నిక్షేపాలను దోచుకునేందుకు అమెరికా ఇజ్రాయిల్‌తో కలిసి పాలస్తీనాపై మారణకాండను సృష్టిస్తోందని విమర్శించారు. గాజాపై దాడులను వ్యతిరేకిస్తున్న దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా పన్నులు విధిస్తోందని అన్నారు.

ఇజ్రాయిల్‌ రెండేండ్లుగా సాగిస్తున్న యుద్ధంలో 50 వేల మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా, లక్షలాదిమంది క్షతగాత్రులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, వయోవృద్ధులు అని చూడకుండా దాడులకు పాల్పడుతోందని అన్నారు. గాజాపై చేస్తున్న పైశాచిక దాడులను ఐక్యరాజ్య సమితిలోని 100కుపైగా దేశాలు వ్యతిరేకిస్తున్నా ఇజ్రాయిల్‌ దాడులకు తెగబడుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులతో గాజా ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని గుర్తు చేశారు. నిలువ నీడ కరువై, తినడానికి తిండి లేక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మానవతా సహాయం కోసం పంపిస్తున్న ఆహారాన్ని సైతం ఇజ్రాయిల్‌ సైనికులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చివరికి ఆస్పత్రులు, స్కూళ్లపైనా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా అమెరికా తన యుద్ధోన్మాదాన్ని ఆపి శాంతి నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. ఏఐయూటీయూసీ నాయకులు భరత్‌ మాట్లాడుతూ పెట్టుబడిదారి సమాజం తన లాభాల కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తుందని లెనిన్‌ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయని అభిప్రాయపడ్డారు. అమెరికా తన వ్యాపార ప్రయోజనాల కోసం ఇజ్రాయిల్‌ను పావుగా ఉపయోగించుకుని గాజాపై మారణకాండను కొనసాగిస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు మహబూబ్‌ యూసఫ్‌, తెలంగాణ ఆఫ్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ సీనియర్‌ నాయకులు ఎంఎన్‌.రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఈశ్వర్రావు, పద్మశ్రీ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి కె. రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ నర్సింహా, సీఐటీయూ హైదరాబాద్‌ సౌత్‌ ఎం. శ్రావణ్‌కుమార్‌, సెంట్రల్‌ సిటీ నాయకులు రాములు, నరేష్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -